శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (15:25 IST)

ధోనీని వెనక్కి నెట్టిన రోహిత్.. తొలి బంతికే రికార్డు సృష్టించిన విజయ్

ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పలు రికార్డులు నెలకొల్పారు. వీరిలో రోహిత్ శర్మ, ధోనీ, విజయ్ శంకర్, విరాట్ కోహ్లీ వంటి వారు ఉన్నారు. 
 
భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 358 సిక్సర్లు కొట్టిన రోహిత్... 355 సిక్సర్లు కొట్టిన మాజీ కెప్టెన్ ధోనీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అలాగే, భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో ద్రవిడ్ (340)ను వెనక్కి నెట్టి ధోనీ (341 ) రెండో స్థానానికి చేరుకోగా, సచిన్ (463) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇకపోతే, ప్రపంచ కప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన మూడో బౌలర్‌గా విజయ్ శంకర్ నిలిచాడు.
 
ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌పై తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(140) సాధించిన క్రికెటర్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. విరాట్(107), సయిద్ అన్వర్(101) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
 
ఇకపోతే, ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2015లో విరాట్ కోహ్లీ (107) దాయాదిపై తొలి సెంచరీ నమోదు చేశాడు. పాక్‌పై వేగంగా సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్(85 బంతులు) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో సెహ్వాగ్(80, 84 బంతులు) ఉన్నాడు.
 
ప్రపంచకప్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. 1987లో సిద్ధు, 1996లో సచిన్, 2011లో యువరాజ్ ఈ ఘనత సాధించారు. 336/5 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2015లో చేసిన 300/7 ఇప్పటి వరకు అత్యధికం.
 
ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం. గతంలో సచిన్ సిద్ధూలు నెలకొల్పిన 90 పరుగుల (1996లో) భాగస్వామ్య రికార్డు తెరమరుగైంది. ఓవరాల్‌గా పాక్‌పై విశ్వకప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం.