రఫ్ఫాడించిన రోహిత్... రెండో వికెట్ కోల్పోయిన భారత్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో మంచి దూకుడు మీదున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరోమారు రఫ్ఫాడించాడు. ఫలితంగా 85 బంతుల్లో సెంచరీ బాదాడు. ఈ క్రమంలో 113 బంతుల్లో 3 సిక్సర్లు, 14 ఫోర్ల సాయంతో 140 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ కళ్లుచెదిరే షాట్లతో అలరించాడు. భారత్‌కు మంచి శుభారంభం అందించిన రోహిత్ 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. షాదాబ్ ఖాన్ వేసిన 30వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి 100 మార్క్ చేరుకున్నాడు.
ముఖ్యంగా, పాక్‌తో వరుసగా రెండో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండోది కాగా వన్డేల్లో 24వ శతకం కావడం విశేషం. చివరిసారిగా 2018 ఆసియా కప్‌లో 111 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. క్లాస్ బ్యాటింగ్‌తో రోహిత్ 140 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
ఈ వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అజేయంగా 122 పరుగులు చేసిన రోహిత్.. తాజాగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌కు ఇది రెండో శతకం కాగా, ఓవరాల్‌గా 24వది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన లోకేశ్ రాహుల్ - రోహిత్ శర్మలు శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ కలిసి అర్థ సెంచరీలు నమోదు చేశారు. అయితే, 136 పరుగుల వీరి భాగస్వామ్యాన్ని రియాజ్ విడగొట్టాడు. 57 పరుగులు చేసిన రాహుల్.. రియాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆ తర్వాత కోహ్లీ సహాయంతో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేయగా, ఆ తర్వాత 140 పరుగులు చేసి, హాసన్ అలీ బౌలింగ్‌లో కీపర్ వాహబ్ రియాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (46), హార్దిక్ పాండ్యా (9)లు క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 41.3 ఓవర్లలో 259 పరుగులు చేసింది.