బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (23:19 IST)

'క్రికెట్ సమరం'లో భారత్ గెలుపు!... చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍ చిత్తు

ప్రపంచ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. నిజానికి టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా 47వ ఓవర్లో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆట నిలిచిపోయింది. కొద్దిసేపటికే వర్షం ఆగడంతో మ్యాచ్ కొనసాగించారు. 
 
చివరి ఓవర్లలో ధాటిగా ఆడడానికి ప్రయత్నించిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు, ఓపెనర్ రోహిత్ శర్మ 140 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. చివర్లో విజయ్ శంకర్ 15 బంతుల్లో 15 పరుగులు చేశాడు. 
 
అలాగే ఓపెనర్‍గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ కూడా అర్థ శతకంతో రాణించాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించిన అనంతరం రాహుల్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా రోహిత్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, మ్యాచ్ ఆఖరులో భారత ఆటగాళ్లు వేగంగా ఆడాలని భావించి వికెట్లను సమర్పించుకున్నారు. ఫలితంగా ధోనీ (1), పాండ్యా (26) చొప్పున పరుగులు చేసి ఔట్ అయ్యారు. 
 
ఆ తర్వాత భారత్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో ఓ దశలో నిలకడ ప్రదర్శించిన పాకిస్థాన్ ఆపై కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకుంది. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్‌తో ఫఖార్ జమాన్ (62), బాబర్ అజామ్ (48)లను అవుట్ చేయడంతో పాకిస్థాన్ తేరుకోలేక పోయింది. వీరిద్దరూ 9 పరుగుల తేడాతో వెనుదిరిగారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య కీలకమైన హఫీజ్ వికెట్ తీయడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ 34.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే మరో 15 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి వుండగా, చేతిలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో మరోమారు వర్షం పడటంతో మ్యాచ్‌ ఆగిపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలు తలా రెండేసి వికెట్లు చొప్పున తీశారు. వర్షం నిలిచిన తర్వాత మ్యాచ్ కొనసాగినా కూడా కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాట్స్‌మెన్లు లేకపోవడంతో పాకిస్థాన్ ఓటమి ఖాయం.