శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (10:50 IST)

వరల్డ్ కప్ 2019 : ఓడిన పిచ్‌పైనే భారత్‌కు అగ్నిపరీక్ష

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, భారత్ తన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌ను మంగళవారం బర్మింగ్‌హామ్ వేదికగా ఉన్న ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ సర్వసన్నద్ధంగా ఉంది. ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఒక వేళ బంగ్లాదేశ్ జట్టు గెలిస్తే తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. 
 
అయితే, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో జరిగింది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ తన తొలి ఓటమిని ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పైనే రుచిచూసింది. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. పైగా, ఇది బ్యాటింగ్‌ వికెట్. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే భారీ స్కోరును సాధించవచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. వర్షం పడే అవకాశమే లేదు. పైగా, ఈ స్టేడియంలో బౌండరీ లైనులో వ్యత్యాసం ఉంది. ఒకవైపు ఎక్కువగానూ, మరోవైపు తక్కువగా ఉంది. ఇదే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. 
 
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ కూడా అంచనాలు మించి రాణిస్తోంది. ముఖ్యంగా, ఆ జట్టు ఆల్‌రౌండర్ షకీబ్ అల్‌హాసన్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. దీంతో బంగ్లాను భారత్ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పైగా, వరల్డ్ కప్ అనగానే భారత్‌కు 2007 నాటి పరాభవమే గుర్తుకువస్తుంది. 
 
అప్పటికి పసికూన అయిన బంగ్లా.. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు దిమ్మదిరిగే షాకిచ్చి గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. అయితే ప్రపంచకప్‌లో బంగ్లాతో ఆడిన మిగతా రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఘనవిజయం సాధించింది. 2011లో గ్రూప్‌ దశలో ఆ జట్టును చిత్తు చేసిన టీమిండియా.. గత టోర్నీలో క్వార్టర్స్‌లో మట్టికరిపించింది. గతంతో పోలిస్తే మెరుగ్గా ఉన్న బంగ్లాతో అప్రమత్తంగా ఉండాల్సిందే.