మేడ్చల్‌లో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో జరిగింది. గత నెల 31వ తేదీన 15 యేళ్ల బాలిక తన స్నేహితులతో స్కూలు నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో బాలికకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్ (50) వచ్చి మాయమాటలు చెప్పి ఆ బాలికను ఆటో ఎక్కించుకుని వెళ్లిపోయాడు.
ఆ మరుసటి రోజు ఈ విషయాన్ని బాలిక స్నేహితులు క్లాస్ టీచర్‌కు చెప్పారు. ఆ తర్వాత ఆ బాలికను పిలిచి విచారించగా, ఆటో డ్రైవర్ అత్యాచారం చేసినట్టు బోరున విలపిస్తూ చెప్పింది. ఆ తర్వాత టీచర్ బాలిక తల్లిదండ్రులకు ఫోను చేసి విషయం చెప్పింది.
అయితే, తమ పరువు పోతుందని భావించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ నెల 4వ తేదీన టీచర్ బాధిత బాలికతో పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.