బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (13:29 IST)

పనిలో తిరిగి చేర్చుకోలేదని డిప్యూటీ డైరెక్టర్‌ను గొంతు కోసి చంపేశాడు... ఎక్కడ?

prathima
ఇటీవల కర్నాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డిప్యూటీ డైరెక్టర్‌ ప్రతిమ (45) హత్య కేసులోని సంచలన నిజం ఒకటి వెలుగులోకి వచ్చింది. కర్నాటక రాష్ట్ర గనులు, భూవిజ్ఞాన శాఖ ఉప సంచాలకులుగా పని చేస్తూ వచ్చిన ఆమె ఇటీవల తన పడక గదిలోనే అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఒక డిప్యూటీ డైరెక్టర్‌ ఇలా మృతి చెందడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాలను గుర్తించారు. తొలగించిన పనిలో చేర్చుకోవాలంటూ నిందితుడు పట్టుబట్టగా, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు ప్రతిమను కొట్టి, కొంతు కోసి హత్య చేసినట్టు తేలింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
డిప్యూటీ డెరెక్టర్ ప్రతిమ (45) వెంట తిరిగిన కిరణ్ (30)ను చామరాజనగర్ జిల్లా మలెమహదేశ్వర బెట్ట పరిధిలో సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ పక్షం రోజుల కిందటి వరకు ఆమె వద్ద కారు డ్రైవరుగా పని చేసేవాడని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి.దయానంద్ శనివారం ఇక్కడ పత్రికవారికి వివరించారు. చరవాణి టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.
 
కిరణ్ (30) అనే నిందితుడు కారును నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారకుడు కావడం, అక్రమంగా క్వారీయింగ్ చేసే ప్రాంతాలకు దాడులకు వెళుతున్న వివరాలను బహిర్గతం చేస్తుండటంతో అతన్ని ప్రతిమ విధుల నుంచి ఇటీవల తొలగించి, మరో కొత్త డ్రైవరును నియమించుకున్నారు. శనివారం రాత్రి ఆమెను కొత్త డ్రైవరు ఫ్లాట్ వద్ద వదలి.. ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొంత సమయానికే కిరణ్ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చాడు. 
 
తనను మళ్లీ పనిలో పెట్టుకోవాలని కాళ్లపై పడి వేడుకున్నాడు. ప్రతిమ మాత్రం స్పందించలేదు. దీంతో ఆగ్రహంతో ఆమెపై కిరణ్ దాడి చేశాడు. 'గొంతుకు వైరుతో ఉరి బిగించి, కింద పడేశాడు. అక్కడి నుంచి పడక గదిలోకి ప్రతిమను లాక్కొని వెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు' అని కమిషనర్ వివరించారు. 
 
తొలుత గనుల వ్యాపారులు ఆమెను హత్య చేశారని పోలీసులు అనుమానించారు. హుణసమారెనహళ్లి, సొణ్ణప్పనహళ్లి చుట్టుపక్కల అక్రమంగా కంకర క్వారీయింగ్ జరుగుతోందని వచ్చిన ఫిర్యాదులతో సిబ్బందితో కలిసి వెళ్లి ప్రతిమ సర్వే చేయించారు. అక్కడ నాలుగు ఎకరాల ఐదు గుంటల భూమిలో అక్రమంగా క్వారీయింగ్ చేసి ప్రభుత్వ ఖజానాకు రూ.25 లక్షల నష్టం వాటిల్లేలా ఆ గనుల యజమానులు అక్రమాలకు పాల్పడినట్లు ఆమె ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 
 
ఒక ఎమ్మెల్యే, గనుల తవ్వకాలు కొనసాగిస్తున్న ముగ్గురి పేర్లను నివేదికలో చేర్చారు. ఇదే ఆమె హత్యకు కారణమై ఉంటుందని మొదట భావించారు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. హంతకుడు కిరణ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.