శుక్రవారం, 9 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (11:55 IST)

కట్నం కింద పాతఫర్నీచర్ ఇచ్చారనీ... పెళ్లిని రద్దు చేసిన వరుడు..

marriage
హైదరాబాద్ నగరంలో ఓ వరుడు అర్థాంతరంగా తన పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీనికి ఆయన చెప్పిన కుంటిసాకు.. కట్నంకింద పాత ఫర్నీచర్ ఇచ్చారంటూ ఆరోపిస్తున్నాడు. పెళ్లికి ముందు తాము అడిగినవి వధువు కుటుంబీకులు ఇవ్వకపోవడంతో వరుడు కుటుంబీకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో కట్నం కింద పాత ఫర్నీచర్ ఇచ్చారని ఆరోపిస్తూ పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీనిపై వధువు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన 25 యేళ్ల మహ్మద్ జకీర్... ఓ బస్సుడ్రైవరు. ఆయనకు 22 యేళ్ల హీనా ఫాతిమా అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. వీరి వివాహం ఆదివారం జరగాల్సివుంది. కానీ, ముహూర్త సమయానికి వరుడు రాలేదు. ముహూర్తం దాటిపోయి గంటలు గడిచినా పెళ్లిమండపం వైపు కన్నెత్తి చూడలేదు. చివరకు వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... జకీర్‌, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్నం కింద పాత ఫర్నిచర్ ఇచ్చారనీ, ఇదే విషయంపై మాట్లాడేందుకు వధువు ఇంటికి వెళ్లగా వారు నోటికి వచ్చినట్టు మాట్లాడారని పోలీసులకు చెప్పారు. అయినప్పటికీ వరుడిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.