హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం - ఓవర్ డోస్‌తో యువకుడి మృతి
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. మత్తుమందును ఓవర్ డోస్ తీసుకున్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహనూమాకు చెందిన మహ్మద్ అహ్మద్ (26) అనే వ్యక్తి మొబైల్ మెకానిక్‌గా ఉమటూ రాజేంద్ర నగర్ సర్కిల్‌లోని కెన్వర్త్ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నాడు. ఆయనతో పాటు అత్తాపూర్‌కు చెందిన సయ్యద్ బిన్ సలామ్ (23) అనే వ్యక్తి హైదరాబాద్ నగరానికి చెందిన షేక్ జారా, కోల్‌కతాకు చెందిన మొమతా బిస్వాస్‌లంతూ కలిసి కో లివింగ్‌గా ఉంటున్నారు.
బుధవారం అహ్మద్ లక్డీకాపూర్‌కు వెళ్ళి ఓ చిన్న ప్యాకెట్‌లో డ్రగ్ కొనుగోలు చేసి తెచ్చాడు. అదే రోజురాత్రి డ్రగ్స్ తీసుకుని నిద్రమత్తులోకి జారుకున్నాడు. అయితే, అర్థరాత్రి సుమారు 1.30 గంటల సమయంలో అపస్మారకస్థితిలోకి వెళ్లివుండటాన్ని తోటి స్నేహితులు గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు నిర్దారించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానే చనిపోయినట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అహ్మద్ స్నేహితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే ఇంటిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఎందుకు కలిసి వుంటున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.