గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:22 IST)

తాంత్రిక పూజల పేరుతో 10 మందిని హత్య చేసిన పూజారి

murder
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ పూజారి తాంత్రిక పూజల పేరుతో ఏకంగా పది మందిని హత్య చేశాడు. ఈ దారుణం నాగర్ కర్నూల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. గుప్తనిధుల ఆశచూపి, క్షుద్రపూజలు చేస్తానంటూ దూరప్రాంతాలకు తీసుకెళ్లి హత్యలకు పాల్పడినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నవంబరు నెలలో వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ హత్యతో ఈ నిందితుడి హత్యలు బయటకొచ్చాయని తెలుస్తోంది. హత్యకు గురైన వెంకటేష్ వద్ద నిందితుడు డబ్బులు తీసుకొని క్షుద్రపూజల పేరిట దూరంగా తీసుకెళ్లి హత్య చేసినట్టు  గుర్తించారని తెలుస్తోంది. వెంకటేష్ కుటుంబ సభ్యులతో నిందితుడికి పరిచయం ఉండడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. 
 
నవంబర్ 26వ తేదీన నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దర్యాప్తు చేస్తుండగా ఈ హత్యలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. కాగా నిందిత వ్యక్తి నాగర్ కర్నూల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అని సమాచారం. నిందిత వ్యక్తి గతంలో జిల్లా కేంద్రంలో కుటుంబంతో కలిసి నివసించేవాడని, రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడని తెలుస్తోంది. 2018లో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాక తాంత్రిక పూజల పేరిట జనాలను నమ్మించడం మొదలుపెట్టాడని సమాచారం. 
 
ఇళ్లలో, పొలాల్లో గుప్తనిధులు వెలికితీతకు తాంత్రిక పూజలు చేస్తానంటూ అమాయక ప్రజలను సదరు నిందితుడు నమ్మించేవాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బు వసూలు, డబ్బు లేని వారి స్థిరాస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు. నిధి దొరికిన తర్వాత డబ్బులు చెల్లిస్తే తిరిగి భూమిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికేవాడని తెలుస్తోంది. 
 
ఎంతకీ నిధి దొరక్క తమ భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేసిన వారిని హత్య చేశాడని తెలుస్తోంది. ఈ విధంగా వేర్వేరు ప్రాంతాల్లో 10కిపైగా హత్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అనుమానాస్పద మృతి కేసులుగా ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయని సమాచారం. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు మంగళవారం ప్రకటన చేసే అవకాశం ఉంది.