శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

భర్తను హత్య చేసిన భార్య... ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు...

murder
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఓ ఆస్పత్రిలో పని చేసే నర్సు ఒకరు తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన ఘజియాబాద్‌‍లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కవిత అనే నర్సు తన భర్త మహేష్‌తో గత నెల 29వ తేదీన గొడవపడింది. దీంతో కక్ష పెంచుకున్న ఆమె.. భర్త రాత్రి నిద్రిస్తున్న వేళ గొంతు నులిపి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత తాను పని చేస్తున్న ఆస్పత్రికి భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి, ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులను నమ్మించే ప్రయత్నం చేసింది.
 
అయితే, శవాన్ని పరిశీలించిన వైద్యులు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవపరీక్ష నిర్వహించారు. ఇందులో గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించింది.
 
తన భర్త నిత్యం తాగివచ్చి తనను కొట్టేవాడని, ఆ రోజున జరిగిన ఘర్షణ తర్వాత హత్య చేసినట్టు అంగీకరించింది. మరోవైపు ఆస్పత్రిలో పని చేసే వినయ్ శర్మ అనే వ్యక్తితో ఈమెకు సంబంధం ఉన్నట్టు తేలింది. భర్తను కవిత హత్య చేయడం వెనుక వినయ్ శర్మ పాత్ర కూడా ఉన్నట్టు వారిద్దరి వాట్సాప్ సందేశాల ఆధారంగా గుర్తించారు.