మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన తండ్రి... చంపేసిన కుమార్తె!!
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారు జిల్లాలో ఓ దారుణం జరిగింది. మద్యం సేవించి వచ్చిన తన అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన తండ్రిని కన్నకుమార్తె చంపేసింది. ఈ విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పూదప్పాండికి చెందిన సురేష్‌కుమార్ (46). ఇతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్‌కుమార్‌కి మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో చిన్న కుమార్తెను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. సురేష్ కుమార్‌తో పెద్దకుమార్తె ఉంటోంది.
ఈ నేపథ్యంలో గత 26వ తేదీన అతను అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేయగా.. మద్యం మత్తులో తన తండ్రి మృతిచెందినట్లు పెద్ద కుమార్తె తెలిపింది. కానీ పోస్టుమార్టం రిపోర్టులో అతని తలకు గాయాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అతని కుమార్తె ఆర్తి వద్ద పోలీసులు దర్యాప్తు చేయగా... ఆమె తన తండ్రిని హత్య చేసినట్లు అంగీకరించింది.
మద్యం మత్తులో ప్రతిరోజు గొడవపడేవాడని, ఘటన ముందు రోజు తనపై దాడిచేయడానికి యత్నించాడని, అప్పుడు అతన్ని నెట్టివేయడంతో గోడకు తల తగిలి గాయం ఏర్పడిందని తెలిపింది. మరుసటి రోజు తనతో అసభ్యకరంగా మాట్లాడటంతో గొంతు నులిమినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు.