మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (16:27 IST)

అంగన్‌వాడీ టీచర్ హత్య కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం : డీజీపీ

rajendranath reddy
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్‌వాడీ టీచరుగా పని చేస్తున్న హనుమాయమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హతమార్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హనుమాయమ్మ హత్య కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీకి డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశించారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. హనుమాయమ్మను స్థానిక వైకాపా నాయకుడు సవలం కొండల్‌ రావు ట్రాక్టరుతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
'నీ భర్త తెదేపాలో ఉన్నాడు. ఆ పార్టీ ఎమ్మెల్యే వెంట తిరుగుతున్నాడు. నువ్వేమో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నావు. మీ ఇద్దరిలో ఎవరో ఒకర్ని చంపే వరకు నేను నిద్రపోను'.. అని రెండు రోజుల కిందట వైకాపా నాయకుడు కొండలరావు హెచ్చరించాడని, ఆయనే ఇంటి వద్ద ఉన్న హనుమాయమ్మ (50)ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడని మృతురాలి భర్త సవలం సుధాకర్‌, కుమార్తె మాధురి ఆరోపించారు.