సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 14 మే 2022 (16:55 IST)

కాబోయే భర్తతో ఆనందంగా డ్యాన్స్ చేసింది, మూడుముళ్లు వేసాక ఆత్మహత్య చేసుకుంది

ఇష్టంలేని పెళ్లిళ్లు. ఇవి ఇప్పుడు కొత్తేమీకాదు. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని కూడా కాపురాలు నెట్టుకొచ్చే జంటలు అనేకం. తను ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచాడని అంటుంటారు. అలాగే... తమకు ఇష్టం వచ్చినవారితో కాకుండా తనకు ఇష్టంలేని వారితో పెళ్లిళ్లు జరుగడం అక్కడక్కడా చోటుచేసుకుంటుంది. ఇలాంటి పెళ్లిళ్లు జరిగినప్పుడు.. కొన్ని జంటలు సర్దుకుపోతాయి. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి విషాదకర ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

 
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లక్ష్మి అనే యువతికి, అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్‌కి నిన్న వివాహం జరిగింది. పెళ్లయ్యాక అప్పగింతల కార్యక్రమం ఈ ఉదయం జరుగబోతోంది. ఇంతలో ఇంట్లో నుంచి కేకలు, ఏడుపులు. ఏం జరిగిందని చూస్తే... నవ వధువు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 
తనకు పెళ్లి ఇష్టం లేదని లక్ష్మి ఇంట్లో చెప్పింది. ఐతే మంచి సంబంధం, కూతురికి అంతకంటే మంచి సంబంధం రాదని పెద్దలు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. దాంతో పెళ్లికి ముందు జరిగిన ప్రి-వెడ్డింగ్ తదితర కార్యక్రమాలలో లక్ష్మి ఎంతో హుషారుగా పాల్గొంది. అవన్నీ చూసి... తమ కుమార్తె పెళ్లికి ఆనందంగా అంగీకరించింది అనుకున్నారు కానీ.. మూడుముళ్లు పడ్డాక ఆమె తన ప్రాణాలను తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.