శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (11:18 IST)

కేబినెట్‌లో డమ్మీ మినిస్టర్.. ఎవరో తెలుసా?

ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఎదురుగాలి వీస్తుందా.. అధికార పార్టీలో చేరి పదవిని అనుభవిస్తున్నా నియోజకవర్గాల్లో మాత్రం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ మారిన వ్యతిరేకతతో పాటు వ్యక్తిగతంగా వారిపై ఉన

ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఎదురుగాలి వీస్తుందా.. అధికార పార్టీలో చేరి పదవిని అనుభవిస్తున్నా నియోజకవర్గాల్లో మాత్రం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ మారిన వ్యతిరేకతతో పాటు వ్యక్తిగతంగా వారిపై ఉన్న వ్యతిరేకత తోడవడంతో వచ్చే ఎన్నికల్లో గడ్డుపరిస్థితిని ఎదుర్కోబోతున్న బలమైన అభ్యర్థులను దించి ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలన్న పట్టుదలలో జగన్ ఉన్నారా. చిత్తూరుజిల్లా పలమనేరు రాజకీయాలను చూస్తే అదే నిజమనిపిస్తోంది.
 
21 మంది తమ ఎమ్మెల్యేలను సంతలో పశువులే అన్నది వైసీపీ వాదన. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ గుర్తుపై గెలిచి నమ్మకద్రోహం చేసి మరీ పదవుల కోసం అధికారపార్టీలో చేరడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే అలా ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో యువనాయకులను బరిలో దింపి పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారు. 
 
చిత్తూరు జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టడం కోసం జగన్ ప్లాన్ రెడీ చేశారు. ఆర్థికంగాను, ప్రజాదరణ పరంగాను మెరుగ్గా ఉన్న వ్యక్తులకు బాధ్యతలను అప్పగిస్తూ అమరనాథరెడ్డికి వణుకు పుట్టిస్తున్నారు. యువనాయకుడు రాకేష్‌ రెడ్డిని పలమనేరు వైసీపీ ఇన్ఛార్జ్‌గా పెట్టడంతో అమరనాథరెడ్డికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ మారడం పట్ల ప్రజల్లో చులకన అయిపోయిన అమరనాథరెడ్డి అధికారపార్టీలో మంత్రి అయిన తరువాత కూడా ఆ వ్యతిరేకతను ఏ మాత్రం తగ్గించుకోలేకపోయారు. 
 
మంత్రి హోదాలో ఉండి నియోజకవర్గ అభివృద్థిని మరిచిపోయి తన సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన రాకేష్‌ రెడ్డి చురుగ్గా రాజకీయాలు చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ ఎప్పుడు పిలుపునిచ్చినా ఓ రేంజ్‌లో సత్తా చాటుతున్నారు. వైసీపీలో ఉన్న నాయకులను, క్యాడర్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని పార్టీ పటిష్టం చేయడం కోసం పోరాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోను అమరనాథరెడ్డికి పలమనేరులో చెక్ పడతామంటున్నారు రాకేష్ రెడ్డి. 
 
రోజు రోజుకు వైసీపీ బలం పెరగడంతో పాటు టీడీపీలో అమరనాథరెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు సొంతజిల్లాలో ఆ పార్టీ సీనియర్ నేతగా అమరనాథరెడ్డి ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి టీడీపీలో చేరడంతో అంతటి స్థానాన్ని కాపాడులేకపోతున్నారు. పార్టీ మారినందుకు చంద్రబాబు మంత్రి పదవినయితే ఇచ్చారు కానీ పవర్స్ లేకుండా చేశారు. దాంతో మంత్రిగా ఉన్నా జిల్లాలో డమ్మీగా మారిపోయారు అమరనాథరెడ్డి. 
 
కుప్పం పక్క నియోజకవర్గం కావడంతో అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నిఘా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు నారా లోకేష్‌ బాబు కూడా అక్కడ మంత్రి కంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో అధికారులు కూడా అమరనాథరెడ్డి కంటే పులివర్తి నానికే ఎక్కువ రెస్పాండ్ అవుతుండడంతో మంత్రి గారు డమ్మీ అయిపోయారట. 
 
కాబట్టి పలమనేరు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న అంతర్గత విభేధాలే తమకు కలుసొస్తాయంటూ సంబరపడిపోతున్నారు వైసీపీ నాయకులు. చూడాలి మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి రాబోయే ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుందో...?