శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 జనవరి 2020 (21:32 IST)

వామ్మో సీఎం జగన్ ప్లాన్... 15 మంది తెదేపా ఎమ్మెల్సీలు జంప్ చేస్తారా?

శాసన మండలిని రద్దు చేయడం దాదాపు ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపధ్యంలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల ఆమోదానికి సంబంధించి బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపుతూ నిబంధనలను పాటించని ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
శాసన మండలి ఎక్కడ రద్దయితే తమ పదవులు ఊడిపోతాయననే భయంలో పలువురు తెదేపా సభ్యులు వున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు తెదేపాను వీడారు. ఇదే బాటలో మరో 10 నుండి 15 మంది సభ్యులు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
 
ఇదిలావుంటే రాష్ట్రంలో మూడు జోన్ల ఏర్పాటు వెనుక ఎన్నో సమస్యలకు పరిష్కారం వున్నట్లు కనిపిస్తోంది. అటు పాలనాపరంగానే కాకుండా ఇటు పార్టీ పరంగానూ వెసులుబాటు వుంటుందని భావించే వైఎస్ జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు విశ్లేషకులం చెబుతున్నారు.
 
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల ఆమోదానికి శాసనమండలిలో చుక్కెదురవుతుందని ముఖ్యమంత్రి ముందుగానే ఊహించినట్లు అర్థమౌతోంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి చట్టం(డీసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవపల్‌మెంట్‌ ఆఫ్‌ ఆల్‌ రీజియన్స్‌ – 2020 యాక్టు)కు సీఎం శ్రీకారం చుట్టారని చెబుతున్నారు.
 
ఈ యాక్టు ప్రకారం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ఆ మూడు జోన్లకు కనీసం 9 మంది సభ్యులను నియమించి అయా ప్రాంత అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. ఈ మూడు కమిటీలకు ముఖ్యమంత్రే అధ్యక్షుడిగా ఉంటారు. ఈ కమిటీల్లో కనీసం 9 మంది సభ్యులు ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు.
 
ఈ 9 మందిలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు నామినేటెడ్‌ సభ్యులు, ఒక ఐఏఎస్‌, మరో అధికారి ఉండనున్నారు. అయితే ప్రభుత్వం నియమించే నలుగురు నామినేటెడ్‌ సభ్యులకు ఎమ్మెల్సీ హోదా కల్పించే అకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ నామినేటెడ్‌ సభ్యుల సంఖ్యను మరింతగా పెంచే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అప్పుడు మండలి రద్దుచేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండబోదని ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. ఒక్కో జోన్‌ నుండి ఎంపీ, ఎమ్మెల్యేలు కాకుండా మరో 10 మంది వరకూ నియమిస్తే మొత్తంగా మూడు జోన్ల పరిధిలో 30 మంది వరకూ నియమించుకునే అవకాశం ఉంది.
 
ఇప్పుడు మండలిలో కూడా అంతకన్నా ఎక్కువ మందిని ఎమ్మెల్సీలుగా నియమించుకునే అవకాశాలు తక్కువే. కాబట్టి ఈ యోచన బాగుంటుందని ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలావుండగా బుధవారం వరకూ లీకులతో కాలం గడిపిన ప్రభుత్వం గురువారం ఏకంగా మండలి వల్ల ప్రయోజనం ఏమిటనే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తూ అసెంబ్లిdలో ముఖ్యమంత్రి సహా అందరూ అభిప్రాయపడ్డారు.
 
ఇలా చేయడం ద్వారా మండలి రద్దు అంశాన్ని సభ్యులు తెలుసుకునేలా చేయడం ఒక రాజకీయ ఎత్తుగడగా కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా చేస్తే సభ్యులు తమ పదవీకాలాన్ని నష్టపోయే ప్రమాదమున్నందున ప్రభుత్వ బిల్లుకు ఆమోదం తెలపడం, అలానే అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరించడం చేస్తారని ప్రభుత్వ పెద్దల యోచనగా కూడా వారు పేర్కొంటున్నారు.