కడప జిల్లాలో వైకాపా పట్టుకోల్పోయిందా? బాబాయ్ ఎందుకు ఓడిపోయారు : జగన్ అంతర్మథనం
వైఎస్ కుటుంబ కంచుకోట కడప జిల్లాలో వైకాపా పట్టుకోల్పోయిందా? ఈ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వైఎస్. వివేకానంద రెడ్డి ఎందుకు ఓడిపోయారు. అతి విశ్వాసమే దెబ్బతీసిందా... ప్రత్యర్థి వ్యూహ
వైఎస్ కుటుంబ కంచుకోట కడప జిల్లాలో వైకాపా పట్టుకోల్పోయిందా? ఈ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వైఎస్. వివేకానంద రెడ్డి ఎందుకు ఓడిపోయారు. అతి విశ్వాసమే దెబ్బతీసిందా... ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడంలో విఫలమయ్యామా? సొంత పార్టీ నేతలే టీడీపీకి ఎందుకు సహకరించారు? ఇత్యాది అంశాలపై వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అంతర్మథనం చెందుతున్నారు.
కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరపున 521 మంది, టీడీపీ తరపున 303 మంది గెలిచారు. ఈ సంఖ్యలను పరిశీలిస్తే.. ఎన్నికల బరిలో యుద్ధం ఒకవైపే. వైఎస్ వివేకానంద రెడ్డి గెలుపు నల్లేరుపై నడకే! కానీ, అతి విశ్వాసమే వైసీపీని దెబ్బతీసింది. కడప ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడానికి టీడీపీ అనుసరిస్తున్న వ్యూహాలను, అడుగులను జగన్ ఏమాత్రం లెక్కలేకి తీసుకోలేదు. ఫలితంగా కడప జిల్లాలో జగన్ కోట పగిలిపోయింది.
నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జగన్ రెండురోజులపాటు కడప జిల్లాలో పర్యటించారు. ఇడుపులపాయలో సగం నియోజకవర్గాల స్థానిక ప్రతినిధులు, నేతలతో సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజు కడపలోని ఓ ఫంక్షన్ హాలులో మరో సగం నియోజకవర్గాల స్థానిక ప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నేతలతో ఫోనులో అందుబాటులో ఉన్నారు.
కానీ... నిర్దిష్టంగా తమకు ఓటు వేసే వారెవరన్నది అంచనా వేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ శిబిరంలో ఉన్నప్పటికీ... ఓటు మాత్రం మాకే వేస్తారు అనే అతి విశ్వాసం వైసీపీ వర్గాల్లో కనిపించింది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో ఓట్లు క్రాస్ అవుతాయని ఊహించారు. ఇవే లెక్కలను జగన్‌కూ చెప్పడంతో ఆయన ధీమాగా ఉన్నారు.