శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: సోమవారం, 13 జులై 2020 (22:44 IST)

బిజెపి, జనసేనల ప్లాన్‌తో వైసిపికి ఇబ్బందులు తప్పవా?

ఎపిలో కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ప్రచారం బాగానే ఉంది. క్వారంటైన్లో సరైన వసతులు లేకపోవడం.. రోగులు ఇబ్బందులు పడడం ఇదంతా ప్రభుత్వాన్ని బాగా ఇరకాటంలో పెడుతోంది. అయితే కరోనా సోకుతున్న సమయంలో జనసేన పార్టీ నాయకులు ఎక్కడా కనిపించడం లేదని.. కొంతమంది మాత్రమే నేతలు బయటకు వచ్చి బిజెపితో కలిసి అక్కడక్కడ ఆందోళనలో పాల్గొంటున్నారన్నది తెలిసిందే.
 
అయితే ఈసారి పక్కా ప్లాన్‌తో బిజెపి, జనసేనలు ప్రభుత్వంపై పోరాటానికి సిద్థమయ్యాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నాయట. రేపటి నుంచి ప్రజలు ఎదుర్కొనే ప్రతి అంశంపైనా నిరసనలు వ్యక్తం చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట నేతలు. 
 
రాష్ట్ర నాయకులు దీనిపై సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి కూడా వచ్చేశారట. కరోనా పెరుగుతున్న సమయంలోను వైసిపి పిపిఈ కిట్లు, అవసరమైన వైద్య సామగ్రి అందించడంలో పూర్తిగా విఫలమైందని ప్రభుత్వంపై ఒత్తిడితోనే చలనం తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చారట.
 
అలాగే ఆత్మనిర్భర భారత్ పేరును ఎపిలో మార్చి జగనన్న తోడు పేరుతో డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. కరోనా సమయంలో 20 లక్షల కోట్లు ఇచ్చి సామాన్యులను ఆదుకున్న నరేంద్రమోడీ గురించి ప్రజలకు మరింతగా తెలియజేయాల్సిన అవసరం ఉందంటున్నారు బిజెపి, జనసేన పార్టీ నేతలు. మరి చూడాలి కరోనా సమయంలో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై ఏ స్థాయిలో పోరాటం చేస్తాయో..?