బీజేపీ-టీడీపీ స్నేహం పక్కానా? మరి జనసేన సంగతేంటి?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాలం ఎవరికైనా గుణపాఠం నేర్పుతుంది. రాజకీయం రంగులరాట్నం. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి. ఇలాంటివన్నీ ఏపీ రాజకీయాల్లో అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. ఏపీ పాలిటిక్స్ డైనమిక్‌గా మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్‌లో కులాసాగా అధికారం అనుభవిస్తుండగా.. రఘురామ రూపంలో ప్రమాదం వచ్చిపడింది. గోటితో పోయేది.. బెయిల్ రద్దు వరకూ దారి తీస్తోంది.
రఘురామ పిటిషన్ కంటే కూడా.. సీబీఐ వాళ్లు బెయిల్ రద్దు వద్దంటూ కౌంటర్ దాఖలు చేయకపోవడమే జగన్‌లో టెన్షన్‌కు కారణమవుతోంది. కేంద్రస్థాయిలో తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే అనుమానం. అందుకు తగ్గట్టే.. బీజేపీని ఆడించే ఆర్ఎస్ఎస్ పత్రిక.. 'ది ఆర్గనైజర్'లో తనకు వ్యతిరేకంగా ప్రత్యేక కథనం రావడం.. అందులో ఆలయాలపై దాడులు, మతమార్పిడిలు, క్రిష్టియానిటీకి ప్రాధాన్యంలాంటి అన్ని అంశాలు ప్రస్తావించడం, రఘురామపై సానుభూతి వ్యక్తం చేయడం జగన్‌కు మింగుడుపడని అంశం. ఆ వ్యాసం తర్వాతే తన కేసులో సీబీఐ స్టాండ్ మారిందని.. అప్పటి బెయిల్ రద్దుపై కౌంటర్ వేస్తామన్న సీబీఐ.. తనను ఇరికించేలా కోర్టు విచక్షణకే వదిలేయడం జగన్‌లో కలవరపాటు క్రియేట్ చేస్తోంది.
నిజానికి బీజేపీనే జగన్‌తో అంటకాగుతోంది. మొదట్లో పెద్దగా పట్టించుకోకున్నా.. రెండేళ్లుగా జగన్ పాలన చూసి ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని డిసైడ్ అయింది. ఆ మేరకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని మెలి పెట్టిందంటున్నారు. అక్కడ స్విచ్ వేస్తే.. ఇక్కడ సీబీఐ కోర్టులో వేగంగా పరిణామాలు మారాయని అంటున్నారు. మరోవైపు.. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుపై సాఫ్ట్ యాంగిల్‌లోనే ఉంటుంది.
తాజాగా, సీఎం జగన్‌కు చెక్ పెట్టాలని భావిస్తుండటం.. చంద్రబాబే వెయ్యిపాళ్లు బెటర్ అనే అభిప్రాయానికి రావడంతో.. బీజేపీ-టీడీపీ మళ్లీ కలిసి పని చేయాలని సంఘ్ పరివార్ పెద్దల నుంచి సూచనలు వచ్చాయట. ఆ మేరకు ఇటీవల టీడీపీ విషయంలో బీజేపీ వైఖరిలో కాస్త మార్పు వచ్చిందని అంటున్నారు. జగన్‌తో దూరం జరిగి.. చంద్రబాబుకు దగ్గరయ్యే దిశగా కేంద్రరాష్ట్రాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెబుతున్నారు.
బీజేపీ-టీడీపీ పొత్తు ఇరువర్గాలకు లాభదాయకమే. 2014లో చంద్రబాబుతో కలిసి ఉన్నప్పుడు.. 4 ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ సీటు దక్కించుకున్నారు కమలనాథులు. దీనికి ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు అదనం. అందుకే, వైసీపీతో అంటకాగిన సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు మినహా మిగతా బీజేపీ నాయకులు టీడీపీతో ఫ్రెండ్‌షిప్‌కు ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేనల మైత్రికి బీటలు వారాయనే వార్తలు వున్నాయి. కమలనాథుల ఒంటెద్దు పోకడలపై జనసేనాని గుర్రుగా ఉన్నారు. అందుకే కాషాయ కండువాలతో అంటీఅంటనట్టు మెదులుతున్నారు. ఇక తెలంగాణ బీజేపీతోనైతే ఎప్పుడో తెగదెంపులు చేసుకున్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని కాదని టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతు ప్రకటించి షాక్ ఇచ్చారు. తిరుపతి ఎంపీ టికెట్ తమకు ఇవ్వలేదనే అక్కసుతో ఉన్నారు. అందుకే, ఉప ఎన్నికలోనూ పెద్దగా ప్రచారం చేయలేదు.
నమ్మకంలేని కాపురం ఎన్నాళ్లో సాగదు. త్వరలోనే బీజేపీ-జనసేన బ్రేకప్ తప్పదు అంటున్నారు. అప్పుడిక బీజేపీకి టీడీపీనే బెస్ట్ ఆప్షన్. గతంలో చంద్రబాబు చేసిన ధర్మపోరాటమే.. ఇప్పుడు కమలనాథులు ముందడుగు వేసేందుకు ఇబ్బందిగా మారింది. అయితే, అప్పటి చంద్రబాబు.. ఇప్పటి చంద్రబాబు ఒకటి కాదు. ఓటమి ఆయనలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. తత్వం బోధపడేలా చేసింది. బీజేపీతో పొత్తు కీలకమని గుర్తించారు. అందుకే, గత రెండేళ్లుగా బాబు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతుగా నిలుస్తున్నారు. కేంద్ర విధానాలను సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి పలు అంశాలపై లేఖలతో కూడిన సూచనలు కూడా చేశారు. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పును బీజేపీ పెద్దలు సైతం గుర్తించారు. టీడీపీ విషయంలో కమలనాథులు సాఫ్ట్‌కార్నర్‌తోనే ఉన్నారని తెలుస్తోంది.
చంద్రబాబులో వచ్చిన మార్పుతో పాటు.. ఆర్ఎస్ఎస్ సైతం బీజేపీ-టీడీపీలు మళ్లీ స్నేహం చేయాలని సూచించడం.. జగన్ పాలనలో ఏపీలో ఆలయాలపై దాడులు.. జనసేన పట్టించుకోకపోవడం.. ఇలా అనేక పరిణామాలు కలిసి.. ఏపీ పొలిటికల్ ఈక్వేషన్స్‌ను మార్చేస్తున్నాయి. అన్నీ కుదిరితే.. త్వరలోనే ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని మరోసారి చూడొచ్చు. లేదంటే, బీజేపీ-టీడీపీ స్నేహం మాత్రం పక్కా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.