శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: బుధవారం, 9 మే 2018 (17:30 IST)

ఓటుకు నోటు కేసు: నెలాఖరుకు సీఎం చంద్రబాబుపై చార్జి షీటా?

ఓటుకు నోటు కేసు ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి బుసలు కొడుతోంది. అప్పట్లో కేంద్రంలో చక్రం తిప్పిన ఒక నాయకుడు కెసిఆర్, చంద్రబాబునాయుడుల మధ్య రాజీ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు మరోసారి చంద్

ఓటుకు నోటు కేసు ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి బుసలు కొడుతోంది. అప్పట్లో కేంద్రంలో చక్రం తిప్పిన ఒక నాయకుడు కెసిఆర్, చంద్రబాబునాయుడుల మధ్య రాజీ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు మరోసారి చంద్రబాబువైపు దూసుకొస్తోంది. తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ జారీ చేసిన ఆదేశాలు టిడిపి నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించేలా చేస్తున్నాయి. 
 
ఇప్పటివరకు మౌనంగా ఉన్న కెసిఆర్ గత రెండురోజులకు ముందు ఉన్నట్లుండి రెండున్నర గంటల పాటు ప్రగతిభవన్‌లో పోలీసు అధికారులు, న్యాయనిపుణులతో చర్చించిన విషయం తెలిసిందే. శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎన్నికల్లో ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినట్లు రుజువైనందున చంద్రబాబే కీలకమవుతారని న్యాయనిపుణులు కెసిఆర్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కెసిఆర్ వెంటనే తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారట. మీపై ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు. చట్టం ప్రకారమే వెళ్ళండని కెసిఆర్ ఆదేశాలిచ్చారట. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును చేర్చాలంటూ వైసిపి ఎమ్మెల్యేలు ఇప్పటికే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. 
 
వారం క్రితమే చంద్రబాబు వాయిస్‌ను అధికారికంగా చంఢీగడ్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలించి నివేదిక ఇచ్చింది. అది చంద్రబాబు స్వరమేనని నిర్థారించింది. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటుకు నోటు కేసులో కెసిఆర్ సమీక్ష సాధారణమైనది కాదని అధికారులు చెబుతున్నారు. ఆదివారం కూడా గవర్నర్‌ను కలిసిన సమయంలో కెసిఆర్ ఓటుకు నోటుకు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారట. తదుపరి చర్యల విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి కూడా చర్చించినట్లు సమాచారం. కెసిఆర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ నెలాఖరులోగా చంద్రబాబుపై ఓటుకు నోటు కేసులో ఛార్జిషీట్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.
 
మూడేళ్ళగా మౌనంగా ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు తిరిగి ఓటుకు నోటు కేసులో అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మూడేళ్ళ క్రితం తెలంగాణా శాసనమండలి ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి టీం ఏకంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కొనేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం మొత్తం ఆడియో, వీడియో టేపులతో సహా బయటపడడంతో దేశంలోనే సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.