మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 8 మే 2018 (19:50 IST)

బాబు పుట్టిన ఊరిలో లోకేష్‌ సాహసమా? ఎవరికి దిమ్మతిరుగుతుందో?

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వస్థలమైన చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఆయన తనయుడు నారా లోకేష్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ చంద్రగిరిని ఎంచుకోవడం సాహసమే అవుతోంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కుప్పంలా,

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వస్థలమైన చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఆయన తనయుడు నారా లోకేష్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ చంద్రగిరిని ఎంచుకోవడం సాహసమే అవుతోంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కుప్పంలా, హిందూపురం మాదిరిగానో గెలుపు గ్యారంటీ లేదు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మాజీమంత్రి గల్లా అరుణ కుమారి, వైసిపి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తలపడ్డారు. వైసిపికే విజయం వరించింది. గత చరిత్ర చూసినా తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాలేవీ ఇక్కడ నమోదు చేయలేదు.
 
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన మొదటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి వెంకట్రామానాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జయదేవనాయుడు గెలుపొందారు. ఆ తరువాత 1985 ఎన్నికల్లో జయదేవనాయుడు టిడిపి తరపున గెలిచారు. 1989లో కాంగ్రెస్ తరపున గల్లా అరుణకుమారి విజయం సాధించారు. 1994 సంవత్సరంలో చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తినాయుడు గెలిచారు. తరువాత 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు గల్లా అరుణకుమారి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. 2014 ఎన్నికల్లోను టిడిపి ఓటమి పాలైంది. ఇటువంటి చోట నుంచి లోకేష్‌ బరిలోకి దిగాలనుకోవడం సాహసమే అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన కుప్పం నుంచి ఎంచుకుని అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. వరుసగా గెలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారన్నది బహిరంగ రహస్యం. అటువంటప్పుడు సునాయాసంగా గెలవడానికి అవకాశమున్న నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. వాస్తవంగా క్రిష్ణాజిల్లా నుంచి పోటీ చేస్తారని చాలాకాలంగా ప్రచారం జరిగింది. ఏమయిందో గానీ ఆయన చంద్రగిరిని ఎన్నుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
చంద్రబాబు నాయుడు కుప్పంకు వెళ్ళడంపై ప్రతిపక్షాలు ప్రతిసారి విమర్శలు చేస్తూనే ఉన్నాయి. స్వస్థలంలో గెలుస్తారన్న నమ్మకం లేక అక్కడికి వెళ్ళారని ఎద్దేవా చేస్తుంటారు. అయినా ఏనాడూ చంద్రబాబు కుప్పాన్ని వదిలి చంద్రగిరికి వచ్చేందుకు సాహసించలేదు. చంద్రబాబు చేయలేని సాహసం లోకేష్‌ చేస్తారా? అనేది ప్రశ్నే. ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన స్థానిక నాయకత్వాన్ని దగ్గరకు తీసుకుంటున్నారని వారితో సంబంధాల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. 
 
చంద్రబాబు నియోజకవర్గంలో చంద్రబాబు సామాజిక వర్గానికి ఎంత బలముందో జగన్ సామాజిక తరగతికీ అంతకన్నా బలం ఉంది. గత ఎన్నికల్లో ఎంత గట్టిగా ప్రయత్నించినా అరుణకుమారి టిడిపి తరపున గెలువలేకపోయారు. లోకేష్‌ ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువలేక ఆయన్ను ఎమ్మెల్సీ చేశారని వైసిపి విమర్శలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికల్లో లోకేష్‌ ఎదుర్కొనే మొదటి ప్రత్యక్ష ఎన్నికలు అవుతాయి.

అలాంటప్పుడు విజయం సాధించగలమని ఢంకా మోగించి చెప్పగల నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఉత్తమంగా ఉంటుంది. చంద్రబాబునాయుడు ప్రచారానికి వెళ్ళకున్నా కుప్పంలో గెలవగలరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతటి పట్టు ఆ పార్టీకి అక్కడ ఉంది. లోకేష్‌ కూడా అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకుంటారని అందరూ భావించారు. తీరా ఆయన చంద్రగిరి అంటున్నారు. ఈ అంశంలో చంద్రబాబునాయుడు తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.