వైకాపా రాజ్యసభ అభ్యర్థుల ఖరారు... నాలుగో సీటు అంబానీ ఫ్రెండ్‌కేనా?
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలచేశారు. ఈ క్రమంలో ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా తరపున నలుగురు అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఇందులో ముగ్గురు అభ్యర్థులను ఇప్పటికే ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్టు సమాచారం. ఇపుడు నాలుగో అభ్యర్థి ఎవరన్నదానిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది.
ప్రస్తుతానికి ఎంపిక చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిల పేర్లను జగన్ ఖరారు చేసినట్టు వైకాపా వర్గాల సమాచారం.
అయితే మొత్తం 175 సీట్లకుగాను వైకాపాకు 151 సీట్లు ఉన్న విషయం తెల్సిందే. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం నాలుగు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సీట్లన్నీ వైసీపీకే దక్కనున్నాయి. నాలుగో సీటును ఎవరికి ఇస్తారన్న విషయంపై స్పష్టత రాలేదు. అయితే, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లేదా రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్ సత్వానీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
నత్వానీ కూడా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడే. ఈయన పదవీకాలం వచ్చే ఏప్రిల్ నెలలో ముగియనుంది. పైగా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి అత్యంత సన్నిహితుడు. ఇదే విషయంపై ఇటీవల సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీతో పాటు నత్వానీ సమావేశమై చర్చలు జరిపినట్టు సమాచారం. దీంతో సీఎం జగన్ కూడా సమ్మతం తెలిపినట్టు సమాచారం. ఎందుకంటే నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించడం వల్ల రిలయన్స్ పెట్టుబడులను రాష్ట్రంలోని ఆహ్వానించవచ్చన్నది జగన్ ప్లాన్‌గా ఉంది.