శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (09:35 IST)

'ఫ్రెండ్‌షిప్ డే' ఎలా ఏర్పడింది.. నేడు స్నేహితుల దినోత్సవం...

"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడిపోదురా.." అంటూ సినీ కవులు కవిత్వం రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిది. అమ్మ అనే పదం తర్వాత అంతటి

"స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడిపోదురా.." అంటూ సినీ కవులు కవిత్వం రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిది. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను పంచే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్పవరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా… స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ప్రతి యేడాది ఆగస్టు నెల తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. అలా, ఆగస్టు 5వ తేదీని ఫ్రెండ్‌షిప్ డేగా నిర్వహిస్తున్నారు.
 
అసలు ఈ స్నేహితుల దినోత్సవం ఎలా ఏర్పడిందో చరిత్రను ఓసారి తిరగేస్తే, 1935వ సంవత్సరం ఆగస్టు మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో చనిపోయిన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తర్వాత రోజైన ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్టు మొదటి ఆదివారాన్ని 'ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే'గా ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్రెండ్‌షిప్ డేను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు ప్రెండ్స్. 
 
ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. 
 
తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకుంటారు. దటీజ్ ఫ్రెండ్‌షిప్ డే.