గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Modified: గురువారం, 25 జులై 2019 (21:34 IST)

యడ్యూరప్పకు చుక్కలు చూపిస్తున్న కుమార స్వామి

కుమారస్వామి సర్కార్‌కు బలపరీక్ష సమయంలో క్షణక్షణం ఉత్కంఠ రేపిన కర్ణాటక రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. విశ్వాస పరీక్షలో కుమార స్వామి సర్కార్ కూలిపోవడంతో తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి కమలదళానికి అధికారం దక్కుకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
 
తన పదవిపోయినా ఫరవాలేదు కానీ ఎట్టి పరిస్థితులలోనూ భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పీఠం దక్కకుండా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ధిక్కార ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ నేత రామలింగారెడ్డితో బేటీ అయ్యారు కుమార స్వామి. రెబల్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని వారిని బుజ్జగిస్తే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ప్రతిపాదనలు పెట్టారు. 
 
రామలింగారెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఎంతోకాలంగా మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్న యడ్యూరప్ప ఆశలకు కుమారస్వామి గండికొడతారా? అనే చర్చ సాగుతోంది. కన్నడ పంచాయతీని తేల్చుకోవడానికి బీజేపీ నేతలు ఢిల్లీలో మకాం వేస్తే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మాత్రం మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా పావులు కదుపుతోంది. 
 
రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన రామలింగారెడ్డిని రంగంలోకి దించి అవసరమైతే, రామలింగారెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదిఏమైనా కుమార స్వామి విశ్వాస పరీక్షలో ఓడిపోయానా భారతీయ జనతా పార్టీకి కన్నడ పీఠం దక్కకుండా రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి..