శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:06 IST)

హుజూర్‌నగర్ బైపోల్ : రేవంత్ రెడ్డిపై కత్తికట్టిన టీపీసీసీ... పార్టీ మారుతారా?

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఫలితంగా ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 
 
దీంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఇక అధికార తెరాస తరపున గతంలో పోటీ చేసిన సైదిరెడ్డి బరిలో ఉన్నారు.
 
బీజేపీ అభ్యర్థి విషయంలో మాత్రం మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన స్థానం కావడంతో కాంగ్రెస్‌లో ఇక్కడ గెలుపు అధికారపక్షానికి, విపక్షానికి ప్రతిష్టాత్మకంగా మారింది. 
 
అయితే, ఇదంతా పక్కనబెడితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో ఎలాంటి ఎత్తుగడ అనుసరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణా చర్య కింద టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఇటీవల కుంతియాకు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి… హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ తరపున కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. 
 
ఈ విషయంపై ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రేవంత్‌పై ఫైరయ్యారు. ఉపఎన్నిక సమయంలో వర్గపోరు కాంగ్రెస్ వర్గాలను కలవరపెడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ సతీమణి పద్మావతికి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయం కావడంతో… రేవంత్ రెడ్డి ఆమెకు పోటీగా కిరణ్ రెడ్డి అనే వ్యక్తిగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. 
 
ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడాలని రేవంత్ రెడ్డి బలంగా నిర్ణయించుకుంటే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను అభ్యర్థిగా ప్రకటిస్తే… కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆమెకు మద్దతు ఇస్తారా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. మొత్తానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ టార్గెట్‌గా రాజకీయాలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి… హుజూర్ నగర్ విషయంలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మరి రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.