బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (22:56 IST)

తెలంగాణలో భాజపాను చూసి కేసీఆర్‌కి భయం పట్టుకుందా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీద వుంది. క్రమంగా పార్టీ బలం పుంజుకుంటోంది. సమస్య ఏదయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే భాజపా ఫోకస్ పక్కాగా చేస్తోంది. ఫలితాలను రాబట్టుకుంటోంది. ఇటీవలే తెలంగాణలోని ముచ్చింతల్ లో సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధానమంత్రి వచ్చారు.


కారణాలు ఏమయినప్పటికీ ఆయనను ఆహ్వానించాల్సిన కేసీఆర్ గైర్హాజరయ్యారు. మరోవైపు తెలంగాణలో ప్రధానమంత్రి తెలుగు భాష గురించి, తెలుగు సినిమాల గురించి పొగడ్తల జల్లు కురిపించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ పట్ల ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తోందంటూ తెలుగువారికి కితాబిచ్చారు.

 
ఇలా మొత్తమ్మీద చూస్తుంటే రానురాను తెలంగాణ రాష్ట్రంలో భాజపా బలపడుతున్నట్లు కనిపిస్తోంది. దీనితో సహజంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి భయం పట్టుకున్నట్లు అనిపిస్తోంది. దాంతో తాజాగా ఆయన ప్రధానమంత్రి మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పుల్వామా దాడి విజయం భాజపాది కాదనీ, సైనికులదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు... దళితల కోసం రాజ్యాంగం కావాలంటూ చర్చకు తెరలేపారు. ఐతే తెలంగాణ వస్తే దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ దళితుల కోసం మాట్లాడటం హస్యాస్పదం అంటూ భాజపా నాయకులు విమర్శిస్తున్నారు.

 
వాస్తవానికి 119 మంది సభ్యుల అసెంబ్లీలో భాజపాకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు ఏడుగురు ఉన్నారు. అయినప్పటికీ బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అన్నట్టుగా సందడి చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ 103 స్థానాలను కలిగి ఉంది. ఐనా ప్రస్తుతం భాజపా చేస్తున్న హడావుడి చూస్తుంటే మాత్రం తెరాసకి ముచ్చమటలు పడుతున్నాయి.

 
ఐతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు అనూహ్యంగా గెలుచుకోవడంతో బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. ప్రత్యేకించి తెలంగాణలో బలాన్ని పెంచుకోవాలనే కోరికను పెంచుకుంది. పటిష్టంగా వుండాల్సిన కాంగ్రెస్ పార్టీ చతికిలపడి పోవడంతో భాజపా చురుకుగా వుంది. గ్రేటర్ మునిసిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని గెలుపొందింది. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా తెరాస ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వున్నారు.

ప్రధానమంత్రి మోదీ చాతుర్యం
 
ఏపీ పునర్విజనపై 'తల్లిని చంపి బిడ్డను రక్షించారు' అని కాంగ్రెస్ పార్టీపై చాలాసార్లు ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ఏర్పాటు సజావుగా జరగలేదంటూ బహిరంగంగా నిందించారు మోదీ. తెలంగాణ ప్రభుత్వాన్ని దూరంగా పెడుతూనే ఏపీకి దగ్గరగా వుంటూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌, కేంద్రంలోని బీజేపీ రెండూ విజయం సాధించాయి. గత ఏడున్నరేళ్లలో తమ తమ నియోజకవర్గాల్లో రెండు ప్రభుత్వాల పనితీరు అందరూ మెచ్చుకునేలా ఉంది.

 
తెలంగాణ అన్ని ప్రధాన ఆర్థిక వృద్ధి సూచికలలో టాప్ 5లో ఉంది. విద్యుత్, నీటిపారుదల, తాగునీరు, పరిశ్రమలు, ఐటీ వంటి అనేక సంక్షేమ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దాని స్వంత వనరులతో అమలు చేసింది. యుపి, బీహార్ మరియు ఎంపి వంటి బిజెపి ప్రధాన రాష్ట్రాలు ఇప్పటికీ అభివృద్ధిలో అట్టడుగు దశలోనే ఉన్నాయి.

 
కేంద్రంలోని భాజపా కొత్త తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి కేటాయించడం లేదంటూ తెరాస విమర్శిస్తోంది. ఐతే లోటు బడ్జెట్ పేరుతో ఏపీకి కేంద్రం చాలా సాయం చేసిందంటూ తెరాస అంటోంది. రెండు ఫైనాన్స్ కమీషన్లు దాదాపు రూ.53,000 కోట్లను లోటు గ్రాంట్‌గా అందించాయి. రూ.60 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తుండడంతో అక్కడ అనేక జాతీయ సంస్థలు నెలకొల్పేందుకు దోహదపడింది.

 
తెలంగాణా ప్రభుత్వంతో బీజేపీ రాజకీయ సంబంధాలు మొదటి నుంచి అంతగా లేవు. ఇటీవలి సంవత్సరాలలో ఇది రాష్ట్రంపై మరింత పక్షపాతాన్ని ప్రదర్శించడం ప్రారంభించిందంటూ కేసీఆర్ బహిరంగంగానే చెపుతున్నారు. కృష్ణా, గోదావరి సమస్యలు ప్రధానాంశాలు. రాజకీయ ఉద్దేశంతో నదీజలాల ప్రాజెక్టుల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన ప్రయోజనాలను కాలరాస్తూ బీజేపీ కాలయాపన చేసి రాష్ట్రానికి నష్టాన్ని తెచ్చిపెట్టింది.

 
ఉద్యోగుల బదిలీలు, రిక్రూట్‌మెంట్‌ల జిఓ 317 జోనలైజేషన్‌కు సంబంధించిన చిన్న స్థానిక సమస్యకు కూడా పెద్ద దుమారం రేగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు, మాజీ మరియు ప్రస్తుత బిజెపి ముఖ్యమంత్రులు తెలంగాణాలో రాజకీయ రైల్‌రోడ్‌ రోకోలు చేసారు. తెలంగాణా పటిష్టత, అభివృద్ధికి భాజపా ఒక్కటే చూపగలదంటూ తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు.

ఏపీ సీఎం సైలెంట్, భాజపా-వైసిపి స్నేహం?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భాజపా పట్ల ఎలాంటి దూకుడు ప్రకటనలు చేయడంలేదు. ప్రధానమంత్రిని పల్లెత్తు మాట అనడంలేదు. బహుశా... రానున్న ఎన్నికల్లో వైసిపీ-భాజపా కలిసి బరిలో నిలుస్తాయేమోనన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.

 
2014లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీపై తన భారాన్ని మోపింది భాజపా. చంద్రబాబు నాయుడు గెలుపుకు సహాయపడింది. వెంకయ్యనాయుడు కేంద్ర కేబినెట్‌లో ఉన్నంత వరకు టీడీపీతో స్నేహం కొనసాగింది. ఆ తర్వాత బీజేపీ నుంచి టీడీపీ విడిపోవడంతో ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పష్టమైన రాజకీయ కారణాలతో కేంద్ర బీజేపీతో సత్సంబంధాలను సాగిస్తోంది. మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ భాజపాకి శత్రువుగా మారితే ఏపీ సీఎం జగన్ మిత్రులుగా వుంటారన్నట్లు కనిపిస్తోంది. చూడాలి, భవిష్యత్ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో?
 
- యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు