మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : గురువారం, 10 మే 2018 (16:04 IST)

జనసేనాని ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అనంతపురమా? తిరుపతా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. ఆయన ఒక్కరే కాదు జనసేన పార్టీ తరపున 175 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను బరిలోకి దించనున్నట్టు ఇటీవల ప్రకటించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. ఆయన ఒక్కరే కాదు జనసేన పార్టీ తరపున 175 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను బరిలోకి దించనున్నట్టు ఇటీవల ప్రకటించారు. పవన్ ప్రకటన అటు అధికార తెలుగుదేశం, ఇటు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర పార్టీలకు ఏమాత్రం మింగుడుపడని అంశంగా చెప్పుకోవచ్చు.
 
అయితే, 2019 ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న అంశంపైనే ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. పవన్‌కు ఏ నియోజకవర్గం అంటే ఇష్టం? తిరపతి నుంచి బరిలోగి దిగుతారా? లేక అనంతపురం నుంచి పోటీ చేస్తారా? అనేది ఇపుడు తేలాల్సి వుంది. 
 
వాస్తవానికి ఏపీ శాసనసభ ఎన్నికలకు మరో యేడాది సమయం ఉంది. కానీ, అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడిలో నిమగ్నమైవున్నాయని చెప్పొచ్చు. అంటే.. అన్ని పార్టీలు అప్పుడే దాదాపు ప్రచారానికి తీసినట్లే కనిపిస్తోంది. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. స్వత్కర్షలతో జనాన్ని ఆకట్టుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తున్నారు.
 
అదేసమయంలో తాము పోటీ చేయదలచుకున్న స్థానాల్లో తమ బలమెంత? తమ కులపు ఓట్లెన్ని? తదితర వివరాలను సేకరించే పనిలో నేతలు నిమగ్నమైవున్నారు. అలాంటి పనుల్లో పవన్ కళ్యాణ్ సైన్యం కూడా ఉంది. 
 
నిజానికి 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత వపన్ కళ్యాణ్ యేడాది కిందటే ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా తన ఊరు కాదు, తన వాడ కాదు. అయినా ఇక్కడ నుంచి పోటీ చేస్తానని ఆయన ఎందుకు ప్రకటించారు? అభిమానం ధనం. ఇక్కడ అభిమానులు అత్యధికంగా ఉండడంతోనే ఆయన ఆ ప్రకటన చేశారు. 
 
మరి జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని ఆయన ప్రకటించలేదు. కానీ, కదిరి లేదా గుంతకల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే అనంతపురం నియోజకవర్గాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. సామాజిక వర్గం, అభిమానుల సంఖ్య వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆయన కదిరి లేదా అనంతపురం లేదా గుంతకల్లు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగవచ్చు. ఈ మూడింటిలో గుంతకల్లుకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
 
అదేసమయంలో మెగా ఫ్యామిలీకి మొదటి నుంచి తిరుపతితో అవినాభావ సంబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీ చేశారు. అయితే ఆయన పాలకొల్లులో ఓడిపోయారు. కానీ తిరుపతి ఓటర్లు ఆయన్ను అక్కున చేర్చుకున్నారు. ఇక్కడ కూడా సామాజిక వర్గంతో పాటు అభిమానులు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దీంతోపాటు ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం కూడా ఉంది. ఈ కారణంగా తిరుపతి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఉంది. పైగా, తెలుగుదేశం పార్టీలో ఉన్న బలహీనతలు కూడా పవన్ కళ్యాణ్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పొచ్చు. అందుకే తిరుపతిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
 
మొత్తానికి పవన్ కళ్యాణ్ నేరుగా శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? లేక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.