శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శుక్రవారం, 10 జులై 2020 (11:47 IST)

వైసిపికి కేంద్రంలో మంత్రి పదవులు ఖాయమేనా? అమిత్ షా ఆ మాట అన్నారా?

భారతీయజనతాపార్టీని విస్తరించాలన్నది నరేంద్రమోడీతో పాటు అమిత్ షాల ఆలోచన. పార్టీని బలోపేతం చేస్తూ ప్రాంతాల పార్టీలను దగ్గర చేర్చుకోవాలన్నది వారి ఆలోచన. అందుకే తమ అనుకూలంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలకు దగ్గరై వారికి అవసరమైన పనులు చేసేందుకు సిద్థమవుతోంది బిజెపి.
 
ఇప్పటి వరకు కరోనాతో ఇబ్బంది పడి ఆ స్కెచ్‌ను మూడునెలల పాటు పక్కన బెట్టారు. కానీ మళ్ళీ ఆ స్కెచ్‌ను ఇంప్లిమెంట్ చేసేందుకు అమిత్ షా సిద్థమవుతున్నారు. త్వరలో బీహార్ రాష్ట్ర ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిత్రపక్షం జెడీయుకు దగ్గరయ్యే పనిలో పడింది బిజెపి. 
 
ఇంతకు ముందే కేంద్ర మంత్రి పదవుల్లో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని జెడీయు అధినేత నితీష్ అలకపాన్పు ఎక్కి కేబినెట్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో మాత్రం కలిసి ముందుకు వెళ్ళేందుకు ఈ రెండు పార్టీలు సిద్థమవుతున్నాయి. ఇద్దరూ కలిసి చర్చలు జరుపుతున్న నేపథ్యంలో వారికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించాలని ప్రధాని భావిస్తున్నారట.
 
పనిలో పనిగా వైసిపికి అవకాశం కల్పించాలని అమిత్ షా మోడీ దృష్టికి తీసుకెళ్ళారట. దేశంలోనే ఎక్కువ ఎంపిలు ఉన్న పార్టీ వైసిపి. 25ఎంపిలు ఉన్న పార్టీగా వైసిపి ఉండడం.. ఎపిలో ప్రాంతీయపార్టీలలో వైసిపి బలంగా ఉండడంతో ఆ పార్టీని కలుపుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట. 
 
అయితే కేంద్ర కేబినెట్లో జెడీయుకు అవకాశం కల్పించే సమయంలో వైసిపికి కూడా కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర పెద్దలు రాష్ట్రంలోని ముఖ్య బిజెపి నేతలతో సంప్రదింపుల జరిపారట. అయితే ఇక్కడ బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణతో పాటు విష్ణువర్థన్ రెడ్డిలో వైసిపిపై విమర్సలు చేయడం.. ట్విట్టర్ ద్వారా వార్ జరుగుతున్న పరిస్థితుల్లో అంతా బెడిసి కొట్టే పరిస్థితి కనబడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
అయితే కేంద్రంలోని పెద్దలే స్వయంగా రంగంలోకి దిగి బిజెపిని పటిష్ట పరిచేందుకు అందరూ సహకారం అందించాలని.. కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తే మాత్రం బిజెపి నేతలందరూ వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో..?