బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (16:38 IST)

జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉండవల్లికి మంత్రి పదవి?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఒకవైపు అధికార టీడీపీ, మరోవైపు జగన్, ఇంకోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలు పోటీపడ్డాయి. 
 
అయితే, ఈ దఫా ఖచ్చితంగా తాము మెజార్టీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని వైకాపా నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీకి కనీసం 100 నుంచి 130 సీట్లు రావొచ్చని వైకాపా నేతలు అంచనా వేస్తున్నారు. వీరి అంచనాలే నిజమైనపక్షంలో వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, వైకాపా ప్రభుత్వం ఏర్పాటుఖాయం. 
 
అయితే, వైకాపా నేతల్లో పెద్దగా అనుభవమున్న సీనియర్ నేతలు పెద్దగా లేరు. ఆ పార్టీలో ఉన్న నేతల్లో మంచి అనుభవమున్నవారిలో బొత్స సత్యనారాయణ (విజయనగరం), పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ (వెస్ట్ గోదావరి), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), ఆనం రామనారాయణ రెడ్డి (నెల్లూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)లు మాత్రమే ఉన్నారు. వీరు గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది.  
 
ఈ నేపథ్యంలో వైకాపా 100 నుంచి 130 సీట్లు గెలుచుకున్నపక్షంలో టీడీపీకి 40 నుంచి 75 సీట్లు రావొచ్చు. అంటే అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఉంటుంది. దీనికితోడు 40 యేళ్ళ సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబును ఎదుర్కోవడం ప్రభుత్వానికి పెనుసవాల్‌తో కూడుకున్నపని. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలో అత్యంత కీలకశాఖల్లో ఒకటైన శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మంచిపట్టున్న, అనుభవజ్ఞుడైన నేతకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఆ కోణంలో ఆరా తీస్తే ఆయన దృష్టిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ నేత, న్యాయవాది అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కనిపించారట. ఆయన వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 
 
ఆయన మరణానంతరం వైకాపాలో చేరకపోయినప్పటికీ.. జగన్‌పై విమర్శలు చేయలేదు. పైగా, జగన్‌పై నమోదైన కేసులు నిలబడవని వాదిస్తూ వస్తున్నారు. అదేసమయంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై అపుడపుడూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో జగన్ చూపు ఉండవల్లివైపు పడినట్టు సమాచారం. అసెంబ్లీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే సరిగ్గా సరిపోతుందని బలంగా నమ్ముతున్నారు. పైగా, మంచి మాటకారి. సభలో చంద్రబాబుకు ధీటుగా సమాధానం చెప్పగలరని భావిస్తున్నారు. 
 
అయితే, ఉండవల్లి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయలేదు. పైగా, శాసననమండలిలో కూడా ఖాళీ లేదు. అంటే.. జగన్ ప్రభుత్వంలో ఉండవల్లి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆర్నెల్లలోపు సభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. ఇందుకోసం వైకాపా ఎమ్మెల్యే ఒకరితో రాజీనామా చేయించాల్సి ఉంటుంది. అయితే, ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటుకావాల్సివుంది.