కొత్త రాష్ట్రపతి ఎంపిక.. సీఎం జగన్ సపోర్ట్ చేస్తారా?
కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునే విషయంలో బీజేపీ కసరత్తు చేస్తోంది. కానీ బీజేపీకి అవసరమైనన్ని ఎలక్టోరల్ ఓట్లు లేవు. బీజేపీతోపాటు ఎన్డీయేలోని మిత్రపక్షాలను కలుపుకున్నా 9,194 ఓట్లు తక్కువవుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 23వ తేదీతో ముగుస్తోంది.
గతంలో రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక సమయంలో ఆప్, శివసేన, టీఆర్ఎస్, అకాలీదళ్ మద్దతిచ్చాయి. తాజాగా ఈ పార్టీలకు, బీజేపీకి వార్ జరుగుతున్న నేపథ్యంలో దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీల మద్దతు అవసరమవుతోంది.
ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి పదవికి పోటీపడతారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేసుకోవాలనే యోచనలో ఉన్న పార్టీ నేతలు వెంకయ్యనాయుడైతే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొస్తున్నారు. మరో ఇద్దరు గవర్నర్ల పేర్లు కూడా వార్తల్లో నిలుస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మొగ్గు వెంకయ్యనాయుడిపై ఉంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని తెలుస్తోంది. అయితే వెంకయ్య నాయుడిపై మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకంగానే ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయగా ముఖ్యమంత్రి ఎదురుదాడి చేశారు.
బీజేపీ అధిష్టానం ఒకవేళ వెంకయ్యనాయుడి పేరు ప్రతిపాదించినా వైఎస్ జగన్ బెట్టు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.