మల్లాది విష్ణు అవుట్... బ్రాహ్మణ కార్పొరేషన్లోకి సీతంరాజు
ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా సీతంరాజు సుధాకర్ అని ప్రకటన వెలువడింది... ఎవరీ సీతంరాజు అని మనకి డౌట్ వచ్చినా ఫరవాలేదు గానీ, బ్రాహ్మణులకే డౌట్ వస్తే... ఇక ఆ పోస్టింగ్ హాస్యాస్పదమే అవుతుంది. సరిగ్గా ఇలాగే జరిగింది. ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా సీతంరాజు సుధాకర్ అనగానే, మాకెవరికీ తెలియదే... ఆయన ఎవరో అని అంటున్నారు...బ్రాహ్మణ ప్రముఖులు. ఎవరికీ తెలియని సీతం రాజు సుధాకర్ గురించి అంతా ఆరా తీస్తున్నారు.
ఏదైనా నామినేటెడ్ పదవికి ఎంపిక అయితే, వారు వార్తల్లో వ్యక్తి అయి ఉంటారు. లేదా, సంఘకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారై ఉంటారు. కానీ, ఈ సీతం రాజు సుధాకర్ గురించి అసలు సమాచారమే లేదు. కనీసం గూగుల్ మాతను ఆశ్రయించినా... సీతంరాజు సుధాకర్ ఎవరో తెలియదనే సమాధానం వస్తోంది.
ఆ పేరు కొడితే గూగుల్‌లో జబర్దస్త్ గాలిపటం సుధాకర్... ఇతర ఫేస్ బుక్ అకౌంట్లు తెరుచుకుంటున్నాయి. ఇలాంటి సీతంరాజు సుధాకర్‌ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేయడంపై వైసీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌తో పాటు ఈయనకే టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా హోదా కల్పించడంపై బ్రాహ్మణ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇంతకీ ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి సీతంరాజు సుధాకర్‌కు రావడానికి ప్రధాన కారణం... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయనకున్న సాన్నిహిత్యమే అని తెలుస్తోంది. విజయసాయితో పాటు సీతం రాజు సుధాకర్ ఎక్కువగా ఢిల్లీలో ఉంటూ పైరవీలు చేస్తుంటారని తెలుస్తోంది.
ఢిల్లీలో విజయసాయికి సహకారంగా ఉండటం వల్లే సీతం రాజుకు బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి వరించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆయన రాష్ట్ర స్థాయిలో, అఖిల భారత స్థాయిలో ఉన్న బ్రాహ్మణ సంఘాలు, కమిటీలు ఎందులోనూ ప్రముఖంగా లేకపోవడంతో... బ్రాహ్మణ వర్గాల నుంచి అసమ్మతి వెల్లడవుతోంది.