శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (17:42 IST)

తప్పిన పెను ముప్పు... భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయిన సౌర తుఫాను

భూమికి పొంచివున్న సౌర తుఫాను ముప్పు తొలగిపోయింది. ఈ తుఫాను భూనికి తాకడం వల్ల క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ ఛిన్నాభిన్నం అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే ఆ సౌర తుఫాను బుధ‌వారం సాయంత్రం భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయినట్లు తాజాగా అమెరికాకు చెందిన నేష‌న‌ల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎన్ఓఏఏ) వెల్ల‌డించింది. 
 
కొన్ని గంట‌ల పాటు ఈ సౌర గాలులు భూమిని చుట్టుముట్టిన‌ట్లు తెలిపింది. అయితే వీటి కార‌ణంగా గుర్తించ‌ద‌గిన మార్పులేమీ సంభ‌వించ‌లేదని స్ప‌ష్టం చేసింది. అయితే ఆ తుఫాను భూ అయాస్కాంత క్షేత్రంపై మాత్రం కాస్త ప్ర‌భావం చూపిన‌ట్లు ఈ అమెరిక‌న్ ఏజెన్సీ తెలిపింది. 
 
ఈ తుఫాను భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధవారం రాత్రి 10.11 స‌మ‌యంలో భూమి మీదుగా వెళ్లిపోయిన‌ట్లు చెప్పింది. దీని జియోమాగ్నెటిక్ కే-ఇండెక్స్ 4గా ఉంది. కే-ఇండెక్స్ అనేది జియోమాగ్నెటిక్ తుఫానుల తీవ్ర‌త‌ను తెలిపే సూచిక‌. 
 
లెవ‌ల్ 4 సూచిస్తోందంటే ఇది స్వ‌ల్ప‌మైన ప్ర‌భావం చూపిన‌ట్లు అర్థం. ఈ సౌర తుఫాను కార‌ణంగా బ‌ల‌హీనమైన ప‌వ‌ర్ గ్రిడ్ ఫ్ల‌క్చువేష‌న్లు క‌నిపించాయ‌ని, ఇక కెన‌డా, అలాస్కాలాంటి ప్రాంతాల్లో అరోరాలు కూడా క‌నిపించిన‌ట్లు ఎన్ఓఏఏ వెల్ల‌డించింది.