శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: బుధవారం, 6 జూన్ 2018 (19:23 IST)

జనసేనాని, జగన్ మోహన్ రెడ్డిలకు టిటిడి నోటీసులు ఇస్తుందా?

టిటిడి వర్సెస్ రమణదీక్షితుల వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మళ్ళీ టిటిడిపై రమణదీక్షితులు విమర్శలు గుప్పించడంతో ఇక ఉపేక్షించరాదని భావిస్తున్నారు టిటిడి అధికారులు. రమణదీక్షితులపై చర్యలకు రంగం సిద్థం చేస్తున్నారు. రమణదీక్షితులతో పాటు టిటిడిపై విమర్సలు

టిటిడి వర్సెస్ రమణదీక్షితుల వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మళ్ళీ టిటిడిపై రమణదీక్షితులు విమర్శలు గుప్పించడంతో ఇక ఉపేక్షించరాదని భావిస్తున్నారు టిటిడి అధికారులు. రమణదీక్షితులపై చర్యలకు రంగం సిద్థం చేస్తున్నారు. రమణదీక్షితులతో పాటు టిటిడిపై విమర్సలు చేసిన వారందరికీ నోటీసులు పంపిచబోతోంది టిటిడి. 
 
ఎట్టకేలకు టిటిడి ఆరోపణలు చేసిన మాజీ అర్చకులు రమణదీక్షితులపై చర్యలు తీసుకోబోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు. పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన రెండవ పాలకమండలి సమావేశంలో రమణదీక్షితుల వ్యవహారంపై ప్రధానంగా చర్చించారు. గతంలో చేసిన ఆరోపణలు కాకుండే తాజాగా రమణదీక్షితులు హైదరాబాదులో మరోసారి టిటిడిపై విరుచుకుపడిన నేపథ్యంలో ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తోంది టిటిడి. 
 
ఈ వ్యవహారంపై దీక్షితులపై చర్యలకు ముఖ్యమంత్రి కూడా ఓకే చెప్పడంతో చర్యలకు ఉపక్రమించబోతున్నారు అధికారులు. ఇందుకోసం టిటిడి లీగల్ సెల్‌లోని లాయర్ల బృందం ఎలా ముందుకు వెళ్ళాలన్నదానిపై చర్చిస్తోందని తెలిపారు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. రమణదీక్షితులపైనే కాకుండా టిటిడిపై ఆరోపణలు చేసిన మిగతా వ్యక్తులకు నోటీసులు అందజేస్తామంటున్నారు. అలాగే రమణదీక్షితుల ఆరోపణల నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను భక్తులకు ప్రదర్శిస్తామంటున్నారు. 
 
వచ్చే పాలకమండలి సమావేశంలో బోర్డు సభ్యులందరికీ ఆభరణాలను ప్రదర్శించి అనంతరం భక్తులకు శ్రీవారి ఆభరణాలను చూపబోతామంటున్నారు. 1952 తిరువాభరణం లిస్ట్ ప్రకారం ప్రతి ఆభరణం గ్రాములతో సహా భద్రంగా ఉందంటున్నారు ఈఓ. భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ చర్య చేపడుతోంది టిటిడి.
 
రమణదీక్షితుల వైఖరిపై టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా మండిపడ్డారు. 24 యేళ్ళుగా శ్రీవారి సేవలో ఉన్న రమణదీక్షితులు ఇప్పుడే విమర్శలు గుప్పించడంపై మతలబు ఏమిటని ప్రశ్నించారు. నిజంగా లోపాలు ఉన్నాయని దీక్షితులుకి అనిపిస్తే తిరుమలకు వచ్చి ఫిర్యాదు చేయాలి కానీ వివిధ నగరాలను తిరుగుతూ టిటిడిపై దుష్ర్పచారం చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిరాశీ వ్యవస్థ రద్దయ్యాక టిటిడి ఆధీనంలోకి వచ్చిన ఆభరణాలన్నీ ప్రదర్శనలోకి ఉంచబోతోంది టిటిడి. 
 
మొత్తం మీద టిటిడికి-రమణదీక్షితులకు మధ్య వివాదం కాస్త న్యాయస్థానం పరిధిలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రమణదీక్షితులు బిజెపి ఎంపి, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు రమణదీక్షితులు రెండు పిటిషన్లను సుప్రీంకోర్టులో విడిగా దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. అర్చకుల పదవీ విరమణపైన, ఆభరణాల భద్రతపైన సుబ్రమణ్యస్వామి పిటిషన్లను దాఖలు చేసేందుకు సిద్థమవుతున్నారు. 
 
టిటిడిని రాష్ట్ర ప్రభుత్వ అజయాయిషీ నుంచి తప్పించేందుకు సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు సుబ్రమణ్యస్వామి. టిటిడికి కూడా వీరి పిటిషన్లను ఎదుర్కొనేందుకు సిద్థమవుతోంది. వారి కన్నా ముందే టిటిడిపై విమర్శలు చేసినవారిపై పరువునష్టం దావా వేసేందుకు సిద్థమవుతోంది టిటిడి. ముందుగా వారికి నోటీసులు అందించి వారిపై కేసులు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రమణదీక్షితులపైనే కాకుండా టిటిడిపై విమర్శలు చేసిన వారందరికీ నోటీసులు ఇస్తామంటున్నారు. ఒకవేళ అదే జరిగితే రాజకీయ దుమారం రేగే పరిస్థితి కనిపిస్తోంది. 
 
ఎందుకంటే బిజెపి ప్రముఖ నాయకులతో పాటు ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి, ఎంపి విజయసాయిరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ లాంటి ప్రముఖులు కూడా టిటిడిపై ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వారికీ నోటీసులు జారీ చేస్తే వారు ఏవిధంగా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారుతోంది. అదేగానీ జరిగితే టిటిడి వ్యవహారం పూర్తిగా రాజకీయరంగు పులుముకునే అవకాశమూ లేకపోలేదు. దీంతో రమణదీక్షితుల వ్యవహారం ఎక్కడదాకా వెళుతుందనేదే పెద్ద చర్చే జరుగుతోంది.