డీఎంకే సలహాదారుగా ప్రశాంత్ కిశోర్?
పోల్ స్ట్రేటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (పీకే) డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ రాజకీయ సలహాదారునిగా చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2021లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ముఖ్యమైన క్యాంపెయినర్‌గా పీకే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు డీఎంకే, కిశోర్ మధ్య చర్చలు ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట డీఎంకే దాదాపు క్లీన్‌స్వీప్ చేసినా.. నాంగునేరి, విక్రవాండి ఉప ఎన్నికల్లో మాత్రం ఆపార్టీ బోల్తాపడింది. దీనికితోడు అన్నాడీఎంకే బలం కూడా పుంజుకుంటోంది. దీంతో అప్రమత్తమైన డీఎంకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం కొత్త వ్యూహాలతో ముందుకువెళ్తోందని పొలిటికల్ స్ట్రేటజిస్టులు అంచనా వేస్తున్నారు.
నటుడు కమల్‌హాసన్ ఆధ్వర్యంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం)తో పీకే చేసుకున్న కాంట్రాక్ట్ ఈ ఏడాది జనవరితో పూర్తయింది. అయితే ఈ కాంట్రాక్ట్ మళ్లీ రెన్యూవల్ చేసుకోలేదని ఎంఎన్ఎం వర్గాలు చెప్పాయి. పీకే ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ=పాక్)తో తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి ఈఏడాది మొదట్లో చర్చలు జరిపినా… అవి విజయవంతం కాలేదు.
మరోవైపు.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. జయలలిత, ఎం.కరుణానిధి లేకుండా జరగబోతున్న మొదటి ఎలక్షన్లు ఇవే. రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే కలిసి పనిచేస్తామని స్టార్ యాక్టర్లు రజనీకాంత్, కమల్‌హాసన్ ఇద్దరూ ఈమధ్యనే ప్రకటించారు.
సాధించిన విజయాలు...
2011లో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి గెలవడంలో కీలకపాత్ర పోషించారు. 2014లో మోడీ, బీజేపీ ప్రచారానికి కొత్త టెక్నిక్‌లు అందించారు. చాయ్‌పే చర్చా క్యాంపెయిన్, 3డీ సభలు, కాంక్లేవ్లు, సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ తయారుచేశారు. బీహారులో నితీశ్‌కుమార్, పంజాబ్‌లో అమరీందర్ సింగ్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేశారు. ఈ నెలలో బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన తృణమూల్‌కు వ్యూహకర్తగా ఉన్నారు. ఫలితంగా మూడు సీట్లలో టీఎంసీ విజయభేరీ మోగించింది.