శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: గురువారం, 19 జులై 2018 (22:08 IST)

టిటిడి అధికారులపై సోషియల్ మీడియా విజయం.. ఎలాగంటే?

తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణం సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16వ తేదీ దాకా భక్తులను దర్శనానికి అనుమతించకూడదని టిటిడి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. టిటిడి అధికారులకు, టిడిపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా… ఈ నిర్ణయంలోని హేత

తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణం సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16వ తేదీ దాకా భక్తులను దర్శనానికి అనుమతించకూడదని టిటిడి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. టిటిడి అధికారులకు, టిడిపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా… ఈ నిర్ణయంలోని హేతుబద్ధతను ప్రశ్నించడానికి ఏమాత్రం ఆసక్తిచూపనప్పటికీ…. సోషల్‌ మీడియా టిటిడి తీసుకున్న నిర్ణయం ఎంత అసంబద్ధమైనదో ఎత్తిచూపుతూ ఏకిపారేసింది. 
 
దీంతో ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జోక్యంతో టిటిడి అధికారులు తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అశుభంగా భావించే గ్రహణాలు వంటి సందర్భాల్లో ఆలయాలను మూసేసి, దర్శనాలు ఆపేయడం పరిపాటి. అయితే…. 12 ఏళ్లకు ఒకసారి జరిగే విశేష ఉత్సవాల సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతించకూడదని తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా ఎత్తిచూపింది.
 
టిటిడి నిర్ణయంపై దుష్ఫ్రచారం చేసిందని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆరోపించారు గానీ…. వాస్తవంగా సామాజిక మాధ్యమాలు సరిగానే స్పందించాయి. ఎందుకంటే టిటిడి తీసుకున్న నిర్ణయం అనేక అనుమానాలకు తావిచ్చేలా వుంది. వందల సంవత్సరాల నుంచి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాసంప్రోక్షణం జరుగుతూనే ఉంది. ఎన్నడూ భక్తులను అనుమతించకుండా ఆపిన ఉదంతాలు లేవు. మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు… అనేది ప్రాథమికమైన ప్రశ్న. దీనికి సరైన సమాధానం అధికారుల వద్ద లేదు.
 
మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు 30 వేల మందికి దర్శనం చేయించగలమని జెఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. బోర్డు ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. రెండు వారాల్లోనే ఎందుకంత మార్పు? పోటులో తవ్వకాలు జరిగాయని రమణ దీక్షితులు ఆరోపించారు. అలాంటి వాటిని సరిచేసుకోడానికే భక్తులను అనుమతించడం లేదని సోషల్‌ మీడియా అనుమానాలు వ్యక్తం చేసింది. అందులో తప్పేముంది? సిసి కెమెరాలు ఆపేస్తున్నారన్న వార్తలూ వచ్చాయి. ఇవన్నీ కూడా భక్తులకు అనుమానాలు కలిగించాయి. సోషల్‌ మీడియాలో వచ్చిన అభిప్రాయాలను ఫీడ్‌ బ్యాక్‌గా టిటిడి భావించాలి. 
 
అంతేతప్ప…. అదేదో దుష్ప్రచారం అనుకుంటే పొరపాటే అవుతుంది. టిటిడి నిర్వహిస్తున్న కాల్‌సెంటర్‌కూ అభిప్రాయాలు వచ్చివుంటాయి. ఏ ఒక్కరూ దర్శనాలను ఆపేయడాన్ని సమర్థించి వుంటారని అనుకోలేం. సోషల్‌ మీడియాలోనూ అదే వ్యక్తమయింది. మరి అది దుష్ప్రచారం ఎలా అవుతుంది? ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడం, వెంటనే ఈవో సింఘాల్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి… తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంటామని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామాలు. ఇది కచ్చితంగా సోషల్‌ మీడియా విజయంగానే చెప్పాలి.