శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్

జగన్ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ - టామ్ అండ్ జెర్రీ ఆట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య మొదలైన యుద్ధం ఇపుడు రసవత్తరంగా మారింది. స్పష్టంగా చెప్పాలంటే సీఎం జగన్ సర్కారు - నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ల మధ్య టామ్ అండ్ జెర్రీ ఆట మొదలైందని చెప్పొచ్చు. 
 
రాజ్యాంగాని విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనరు పదవీకాలాన్ని కుదించడం కుదరదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆపైగా, ఎస్ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు ఇందుకు సంబంధించిన జీవోలన్నింటినీ కోర్టు కొట్టివేసింది. 
 
హైకోర్టు తీర్పు అనంతరం, 'నేను మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను' అని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. అదే సర్క్యులర్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి (ఇన్‌చార్జి) జీవీఎస్‌ ప్రసాద్‌ అటెస్ట్‌ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ అధికారులందరికీ పంపించారు. దీంతో... నిమ్మగడ్డ మళ్లీ బాధ్యతలు స్వీకరించినట్లు అధికారికంగా ధృవీకరించినట్టయింది. 
 
అయితే, రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. శనివారం రాత్రి అసాధారణ రీతిలో ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్. శ్రీరాం మీడియా ముందుకు వచ్చారు. ఆయనకు ఇరువైపులా సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, మరోవైపు పంచాయతీరాజ్‌ కార్యదర్శి కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఆసీనులయ్యారు. వారి సమక్షంలో ఏజీ ఎస్‌.శ్రీరాం ఒక ప్రకటన చేశారు. 
 
'నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ చెల్లదు' అని తెలిపారు. ఈ తీర్పుపై తాము సుప్రీంకోర్టును వెళతామని చెప్పారు. అంటే... నిమ్మగడ్డను ప్రభుత్వం ఎస్‌ఈసీగా గుర్తించడంలేదని తేల్చిచెప్పినట్టయింది. అందుకు తగినట్లుగానే... ఏజీ ప్రెస్‌మీట్‌ ముగిసిన కాసేపటికే, ఎస్‌ఈసీ కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌ నుంచి మరో సర్క్యులర్‌ వెలువడింది. 
 
'నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా మళ్లీ బాధ్యతలు చేపట్టినట్లు జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశం వచ్చేదాకా ఇదే స్థితి కొనసాగుతుంది' అని అందులో పేర్కొన్నారు. ఈ తాజా సర్క్యులర్‌ పూర్తిగా ప్రభుత్వ నిర్దేశితమని తెలుస్తోంది. 
 
దీనిని జారీ చేసేముందు రమేశ్‌ కుమార్‌ను సంప్రదించలేదు. ఆయన ఆమోదం తీసుకోలేదు. వెరసి... హైకోర్టు తీర్పును జీర్ణించుకోలేని, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా పునఃనియామకాన్ని అంగీకరించలేని ప్రభుత్వం... దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌తో వివరణ ఇప్పించి, ఎస్‌ఈసీ సెక్రటరీ ద్వారా విత్‌డ్రా సర్క్యులర్‌ జారీ చేయించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సర్కారు చర్యపై పలువురు న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.