సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (15:31 IST)

పేరుకే పోటీ.. ఓడిపోవాలని కోరుకుంటున్న అభ్యర్థులు.. ఎవరు?

మనిషి అన్నాక సెంటిమెంట్లు ఉంటాయి. ఇక రాజకీయ నేతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి చిన్నపనికి రాహుకాలం, యమగండం, దుర్మూహర్తం ఇలా ప్రతిదీ చూస్తుంటారు. అంటే సెంటిమెంట్‌ను రాజకీయ నేతలు బలంగా నమ్ముతారు. 
 
అలాంటి సెంటిమెంట్ అంశం ఇపుడు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏపీ శాసనసభకు ఎన్నికలు ముగిశాయి. ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ ఫలితాల సంగతి ఎటున్నప్పటికీ.. కొందరు సెంటిమెంట్ అంశాలను తెరపైకి తెస్తున్నారు. 
 
ఆ సెగ్మెంట్‌లో దశాబ్దాలుగా ఇదే సెంటిమెంట్‌ నిజమవుతోంది. ఆ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్ర స్థాయిలో అధికారంలోకి రాదు. ఓడితే మాత్రం సింహాసనం ఖాయం. అందుకే ఆ నియోజకవర్గంలో గెలవడం ఎందుకని, ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తాయి. మరి ఈసారి అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందా లేదంటే సంప్రదాయం బద్దలవుతుందా ఇంతకీ ఏదా నియోజకవర్గం? అనే అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం.
 
రాయలసీమలోని జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఈ జిల్లాలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఉరవకొండ ఒకటి. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారో.. ఆ అభ్యర్థి పార్టీ మాత్రం అధికారంలోకి రాదు. యాదృచ్ఛికమో ఓటరు చైతన్యమో తెలియదుకానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడి ఓటర్లు ఓడించి తీరుతున్నారు.

దశాబ్దాలుగా ఇదే ఫలితం రిపీట్ అవుతోంది. ఈ సెంటిమెంట్‌ను బట్టి చూస్తుంటే, ఇక్కడ ఓడటమే మేలని ప్రధాన రాజకీయ పార్టీలు లోలోన భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన పయ్యావుల కేశవ్ ఓడిపోయారు. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 
 
ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ తరపున శాసన మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, వైసీపీ అభ్యర్థిగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పోటీపడ్డారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి.. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌పై 2,275 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మరోసారి ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇద్దరూ హోరాహోరీగా ప్రచారం చేశారు. 
 
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,744 మంది. ఇందులో 1,07,637 మంది పురుషులు, 1,08,085 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 1,85,981 ఓటర్లు అనగా, 86.22 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో ఉరవకొండ పట్టణం, మండలంతో పాటు విడపనకల్లు, వజ్రకరూరు, బెలుగుప్ప, కూడేరు మండలాలు ఉన్నాయి. 
 
ఉరవకొండ పట్టణంతో పాటు ఉరవకొండ మండలం, బెలుగుప్పలో టీడీపీకి అధికంగా ఓట్లు పోలయ్యాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి వజ్రకరూరు కాంగ్రెస్, వైసీపీకే మెజార్టీ ఉంటుంది. కూడేరు, విడపనకల్లులో పోలింగ్ హోరాహోరీగా సాగినట్లు తెలుస్తోంది. పయ్యావుల కేశవ్ యేడాది ముందు నుంచి నియోజకవర్గంలో కలియ తిరుగుతూ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రజలకు వివరించారు. 
 
హంద్రీ నీవా నీటిని చెరువులకు తీసుకురావడంతో పాటు వేల కోట్ల నిధులతో ఉరవకొండ అభివృద్ధికి పాటుపడ్డామని, అభివృద్దికి ఓటర్లు పట్టం కట్టారని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభించాయని, తమ పోరాటాలతోనే అభివృద్ది పనులు జరుగుతున్నాయని వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.
 
ఐదేళ‌్లు ప్రజా సమస్యలపై పోరాటం చేశామని ప్రభుత్వంతో పనులు చేయించేందుకు తమ వంతు కృషి చేశామని అంటున్నారు. ఇలా గెలుపుపై ఎవరి దీమా వారిదే. అంతిమ ఫలితం మే 23నే తేలుతుంది. పేరుకు మాత్రం తమదే గెలుపు అని చెబుతున్నప్పటికీ... లోలోపల మాత్రం తాను ఓడిపోయినా ఫర్లేదు కానీ తమ పార్టీ మాత్రం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.