గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 3 సెప్టెంబరు 2018 (19:02 IST)

కేసిఆర్‌లో కసి తగ్గిందా... ఎందుకు నీరసంగా మాట్లాడారో తెలుసా?

మాటల మాంత్రికుడు, ఉపన్యాస చక్రవర్తి ఇటువంటి ఎన్ని విశేషణాలైనా సరిపోవు ఆయనకు. అది భారీ బహిరంగసభ అయినా, చిన్నపాటి మీడియా సమావేశమైనా ఆయన మాట్లాడుతుంటే మంత్రముగ్ధులై వినాల్సిందే. చురకత్తుల్లాంటి మాటలు, నవ్వుల పూలు పూయించే చమకులు ఆయన సొంతం. అలవోకగా నోటి న

మాటల మాంత్రికుడు, ఉపన్యాస చక్రవర్తి ఇటువంటి ఎన్ని విశేషణాలైనా సరిపోవు ఆయనకు. అది భారీ బహిరంగసభ అయినా, చిన్నపాటి మీడియా సమావేశమైనా ఆయన మాట్లాడుతుంటే మంత్రముగ్ధులై వినాల్సిందే. చురకత్తుల్లాంటి మాటలు, నవ్వుల పూలు పూయించే చమకులు ఆయన సొంతం. అలవోకగా నోటి నుంచి వచ్చే సామెతలు ఆ ఉపన్యాసానికి అదనపు అలంకరణ. ఇవన్నీ ఎవరి గురించో ఇప్పటికే అర్థమైవుటుంది. ఆయనే టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌.
 
అటువంటి కెసిఆర్‌ ప్రగతి నివేదన సభలో మాట్లాడిన తీరుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సభలో ఏమి చెప్పాలనుకున్నారు, ఏమి చెప్పారు, విజయవంతమయిందా, విఫలమయిందా, టిఆర్‌ఎస్‌ నేతలు చెప్పినట్లు 25 లక్షల మంది వచ్చారా, నాలుగైదు లక్షల మందికి మించలేదా…. ఇటువంటి అంశాలపై సభ ముగిసిన కొన్ని నిమిషాల్లోనే టివి ఛానళ్లలో చర్చ మొదలయింది. అన్నింటికన్నా… కెసిఆర్‌ 45 నిమిషాల్లోనే ఉపన్యాసం ముగించడం, అదీ తన సహజ ధోరణికి భిన్నంగా అత్యంత పేలవంగా మాట్లాడటంపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి.
 
ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది వస్తారని, పక్క రాష్ట్రాల నుంచి కూడా వాహనాలను సమకూర్చుకుంటున్నామని టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతూ వచ్చారు. ఇది దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద సభ అవుతుందని అభివర్ణించారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఈ సభలో కెసిఆర్‌ కీలక ప్రకటన చేస్తారని అందరూ ఎదురుచూశారు. 
 
కానీ ఇవేవీ జరగలేదు. జనం నాలుగైదు లక్షల మందికి మించి లేరన్నది అదరూ చెబుతున్న మాట. జనం సంగతి పక్కనపెడితే…. కెసిఆర్‌ ప్రసంగం అంత పేలవంగా ఎందుకు సాగిందనేది ప్రశ్న. లక్షల మంది ఎదురుగా ఉన్నప్పుడు ఉర్రూతలూగించకుండా సాదాసీదాగా ఎందుకు మాట్లాడారు? ఏదైనా ఊహించని పరిణామాలు ఎదురయ్యాయా? కెసిఆర్‌ ఆశించినది జరగలేదా?
 
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే… కేంద్రం సహకారం తప్పనిసరి. ఎన్నికల సంఘం ఎంత స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థ అయినా…. ఆచరణలో కేంద్ర పెద్దల ప్రమేయమూ ఎంతోకొంత ఉంటుందనడంలో సందేహం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి నరేంద్ర మోదీ ఓకే అనలేదా? అనే అనుమానం సర్వత్రా కలుగుతోంది. అయినా… ముందుగా నిర్ణయించుకున్న ఈ సభను వాయిదా వేయకుండా మొక్కుబడిగా జరిపేశారా… ఆ నిరుత్సాహం నుంచే కెసిఆర్‌ అంత పేలవంగా మాట్లాడారా… ఇటువంటి అనుమానాలన్నీ కలుగుతున్నాయి. 
 
రాజకీయ నిర్ణయం త్వరలో వెల్లడిస్తానని ప్రకటించడం తప్ప ఇంకో స్పష్టమైన మాట ఏదీ కెసిఆర్‌ చెప్పలేదు. నిర్ణయం తీసుకుని దాన్ని ప్రకటించడానికి భారీ సభ పెడితే అర్థముంది తప్ప…. నిర్ణయం తరువాత ప్రకటిస్తానని చెప్పడానికి ఇంత హడావుడి ఎందుకనేది ప్రశ్న.
 
ప్రగతి నివేదన సభలో కెసిఆర్‌ను గమనిస్తే…. ఆయన అంత ఉత్సాహంగా కూడా ఉన్నట్లు కనిపించలేదు. తన ముందు లక్షలాది మంది జనం గుమిగూడివున్నారన్న స్పృహలో కూడా ఆయన ఉన్నట్లు అనిపించలేదు. వేదిక పైకి రావడం, మాట్లాడటం, ఉపన్యాసం ముగిసిన కొన్ని నిమిషాల్లోనే అక్కడి నుండి బయలుదేరడం అన్నీ చాలా యథాలాపంగా జరిగినట్లు అనిపిస్తుంది. అయినా… కెసిఆర్‌ అంతగా నీరసపడటానికి కారణాలు ఏమిటి? అసలు ముందస్తు ఉంటుందా? ఇప్పట్లో రాజకీయ నిర్ణయాలు ఉంటాయా? ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.