మంగళవారం, 19 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 15 జులై 2019 (17:44 IST)

గురుపూర్ణిమ ఎలా వచ్చింది...? ఏం చేయాలి...?

సృష్టిలో ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి. ఆ తరువాత మనకు జ్ఞానాన్ని అందించి ఇది మంచి... ఇది చెడు అని చెప్పేవారు గురువు. అలాంటి గురువుని పూజించడం కోసం మన సాంప్రదాయంగా వస్తున్న పండుగ గురుపూర్ణిమ. అసలు గురువు అంటే ఏమిటి... గు-అంటే అజ్ఞానమనే చీకటిని రు-అంటే పోగొట్టేవాడని అర్థం. అంటే ఎవరైతే గురువుని భక్తిశ్రద్ధలతో సేవిస్తారో వారి అజ్ఞానాన్ని గురువు నశింపచేస్తారు.
 
వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురుపూర్ణిమగా ఈ పండుగను జరుపుకుంటున్నాము. అసలు గురు పూర్ణిమను ఎందుకు జరుపుకుంటున్నాము... సాయినాధుడు దీనిని గురించి ఏవిధంగా చెప్పారు? శిరిడీలో సాయినాధుడు బౌతికంగా ఉన్న రోజుల్లో 1908వ సంవత్సరంలో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీ నూల్కర్ చావడిలో ఉన్నాడు. 
 
అప్పుడు బాబా శ్యామాతో ఆ నూల్కర్‌ను ధుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పి రాగానే మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు. సాయీ... మీకైతే పూజ చేస్తాము కానీ ఆ స్తంభాన్నెందుకు పూజిస్తాము అన్నాడు శ్యామా.... మొదట అంగీకరించని బాబా శ్యామా పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. అంతలో నూల్కర్ పంచాంగం చూస్తే ఆరోజు వ్యాస గురుపూర్ణిమ. అక్కడ ఉన్న భక్తులందరూ సాయినాధునికి ధోవతులిచ్చి పూజించారు. అప్పటి నుండి శిరిడీలో గురుపూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది. 
 
సాయినాధుడు నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవము ఇదొక్కటే... అయితే సాయి స్తంభాన్నెందుకు పూజించమన్నారు... భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు. గురువు ఎన్నడూ నన్ను పూజించు అనరు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే... వారికి శిష్యులెలా ఉంటారు... తాను గురువు అని తలచేవాడు ఆ పేరుకే తగడు అన్నారు రమణ మహర్షి. అలా అనలేదు కనుకనే సాయి సమర్ద సద్గురువు.
 
ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభం. అది నేలలో దృఢంగా నాటుకుని ఉంటుంది. ఆ బలంతోనే అది ఆ భవనాన్నశ్రయించే వారందరిని రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో, గురుభక్తిలో నాటుకుని ఉంటారు. అంటే... గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు స్థంభం లాగే... గురురూపాన్ని తగు రీతిన కొలవమని సాయి భావం.
 
నిరంతంరం గురువుని సేవించే వారికి అప్రయత్నంగా అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. గురువే సకల దేవతా స్వరూపం. గురు పూర్ణిమ రోజున సాయినాధుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.