శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (17:26 IST)

పెద్దనోట్ల రద్దుతో ఒరిగిందేమిటి? విదేశాల్లో మూలుగుతున్న 90శాతం నల్లధనం.. (వీడియో)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు అమలు చేసి నేటికి (నవంబర్ 8వ తేదీ) యేడాది పూర్తికానుంది. గడచిన సంవత్సర కాలంలో నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాలనిచ్చింది..? ప్రజలకు ఏమైనా మేలు చేసింద

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు అమలు చేసి నేటికి (నవంబర్ 8వ తేదీ) యేడాది పూర్తికానుంది. గడచిన సంవత్సర కాలంలో నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాలనిచ్చింది..? ప్రజలకు ఏమైనా మేలు చేసిందా..? వెలుగులోకి వచ్చిన నల్లధనం మొత్తమెంత..? పోనీ ప్రజలంతా డిజిటలైజేషన్‌ వైపు మొగ్గు చూపారా..? ఇలాంటి ప్రతి ప్రశ్నకూ సమాధానం లేదు. ఈ కఠోర వాస్తవాలను కప్పిపుచ్చే క్రమంలో... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు అనుకూల ర్యాలీ నిర్వహిస్తున్నాయి. అదేసమయంలో విపక్షాలు నవంబర్‌ 8ని బ్లాక్‌డేగా వర్ణిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నాయి.
 
2016 నవంబర్‌ 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆదరా బాదరాగా కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. నోట్ల మార్పిడి చేసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చొని.. నిల్చొని నీరసించిపోయి వందమందికి పైగా చనిపోయారు. నోట్లరద్దుతో రైతులు, పేదలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. మోడీ సర్కార్‌ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని ఎన్నో సర్వేలు నిరూపించాయి. 90 శాతం నల్లధనం విదేశాల్లోనే మూలుగుతోందని, నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న ప్రధాని ఇచ్చిన హామీ ఎండమావిగా మారిపోయింది. 
 
పెద్దనోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, ఫేక్‌ కరెన్సీ నిర్మూలిస్తామన్న మోడీ ఆకాంక్ష నెరవేరకపోగా.... అది మరింత పెరిగిందని విపక్షాలతో పాటు.. పలు సర్వేలూ ఘోషిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో నిరుద్యోగిత పెరిగిందని ఆరోపిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయని విపక్ష నేతలు ఘోషిస్తున్నారు. మొత్తంమీద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏదోరకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది కఠోర వాస్తవం. అనేక ప్రాంతాల్లో యేడాది కాలంగా ఏటీఎంలు మూతపడేవున్నాయి. అంటే మరికొన్ని ఏటీఎంలలో ఏనీ టైమ్ నో మని బోర్డులు దర్శనమిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలకు దిగుతున్న వేళ.. అధికార బీజేపీ నేతలు పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ... నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని పాటించనుంది. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. నల్లధనం నిర్మూలనలో భాగంగానే పెద్దనోట్లను రద్దు చేసినట్లు తమ చర్యను సమర్థించుకుంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోట్లరద్దు నిర్ణయంపై అధికార, విపక్షాల ఆందోళన ప్రజలపై ఎంత ప్రభావితం చేస్తుందన్నది వేచి చూడాలి.