సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (08:32 IST)

విమర్శలు.. పొగడ్తలు : పెద్ద నోట్ల రద్దుకు యేడాది

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దుచేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం ప్రకటించి బుధవారానికి సరిగ్గా యేడాది పూర్తికానుంది. కీలకమైన ఈ అడుగు తర్వాత దేశవ్యాప్

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దుచేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం ప్రకటించి బుధవారానికి సరిగ్గా యేడాది పూర్తికానుంది. కీలకమైన ఈ అడుగు తర్వాత దేశవ్యాప్తంగా కనిపించిన ప్రభావంపై అధికార, విపక్షాల్లో భిన్నరకాల వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. నవంబరు 8వ తేదీని నల్లధనం వ్యతిరేకదినంగా పాటించాలని బీజేపీ పిలుపునిస్తే, దేశవ్యాప్తంగా నిరసనదినం నిర్వహించాలని ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ నిర్ణయించింది. 
 
రూ.500, రూ.1000 విలువైన నోట్లను 2016 నవంబరు 8వ తేదీన రద్దు చేయడం వల్ల పెద్ద నోట్ల చలామణీ తగ్గడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోతే వ్యవస్థలో పెద్దనోట్లు ఎంతగా పెరిగిపోయి ఉండేవో వివరించింది. దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఏడాది క్రితం తీసుకున్నది ఎంతో కీలకమైన నిర్ణయమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కొనియాడారు. 
 
ఉగ్రవాదులకు, మావోయిస్టులకు నిధుల ప్రవాహం నిలిచిపోయేందుకు, కాశ్మీర్‌లో సైనికులపై రాళ్లదాడి ఆగిపోవడానికి ప్రభుత్వ నిర్ణయం దోహదపడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. డిజిటల్‌ చెల్లింపుల రెండో దశ ప్రోత్సాహానికి ప్రచారాన్ని వచ్చే జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 
 
అయితే, విపక్షనేతలు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. నోట్లరద్దు అనేది నల్లధనాన్ని సక్రమ నగదుగా మార్చుకునేందుకు ఉద్దేశించిన పెద్ద కుంభకోణంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ మందగించిందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఘాటైన విమర్శలు చేశారు. 
 
మరోవైపు, ‘ఇండియా సఫర్స్‌’ పేరుతో బుధవారం(నవంబర్-8) పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేసింది. గత ఏడాది ప్రధాని కీలక ప్రకటన చేసిన సమయాన్ని గుర్తు చేసేలా రాత్రి సరిగ్గా 8 గంటలకు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో వ్యాపార వర్గాలతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ కానున్నారు.