గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2020
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (20:57 IST)

#FlashBack2020 : కరోనా కష్టకాలంలో ఇంటివారైన సినీ సెలెబ్రిటీలు

2020 సంవత్సరం ఏ ఒక్కరికీ మంచి చేయలేదు. యేడాది ఆరంభం నుంచి సంవత్సరాఖరు వరకు గడ్డుపరిస్థితులనే ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా, కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశ ప్రజలంతా అష్టకష్టాలు పడ్డారు.. పడుతున్నారు. కోట్లాది మంది ఉపాధిని కోల్పోయి, పూట గడవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. అనేక పేదల బతుకులను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా, సినీ ఇండస్ట్రీ సినిమా పీక‌ల్లోతు క‌ష్టాల్లో మునిగిపోయింది. 
 
క‌రోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకుగాను కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. ఫలితంగా సినిమా షూటింగులతో పాటు అన్ని రకాల పరిశ్రమలన్నీ వాయిదాపడ్డాయి. పలు రాష్ట్రాల్లో థియేటర్లు ఇప్పటికీ తెరుచుకోలేదు. దీంతో సినిమా రంగంపై ఆధార‌ప‌డిన లక్షలాది మంది కార్మికులు రోడ్డుపడ్డారు. ఇక షూటింగ్స్ స‌డెన్‌గా ఆగిపోవ‌డంతో అప్పులు తెచ్చిన నిర్మాత‌లు ల‌బోదిబోమ‌న్నారు. ఏదేమైన ఈ సంవ‌త్స‌రం ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి దుర్భ‌రంగానే మారింద‌ని చెప్పాలి.
 
ఇలాంటి గడ్డుపరిస్థితుల్లోనూ అనేక మంది సెలెబ్రిటీలు ఓ ఇంటివారయ్యారు. ఇంతకాలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్నవారు పెళ్లిపీటలెక్కారు. క‌రోనా కాలంలో త‌మ ప్రియ‌సఖిని పెళ్ళి చేసుకొని ఈ ఇయ‌ర్‌ని కాస్త స్పెష‌ల్‌గా మార్చుకున్నారు. ఇందులో కొంద‌రు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోగా, మ‌రి కొంద‌రు పెద్ద‌లు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నారు. ఈ ఏడాది ముగుస్తున్న క్ర‌మంలో 2020 పెళ్ళి పీట‌లెక్కిన సెల‌బ్రిటీల వివ‌రాలను పరిశీలిస్తే, 
 
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు.. ఈయన మే 10వ తేదీన తేజస్వి అనే మాజీ ఎయిర్‌హోస్ట్‌ను పెళ్లి చేసుకున్నారు. 
హీరో నిఖిల్ సిద్ధార్థ్.. మే 14న పెద్దలు ఎంపిక చేసిన డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకున్నాడు. 
హీరో నితిన్.. జూలై 26న షాలిని అనే యువతిని అంగరంగ వైభవంగా పెళ్లాడాడు.

 
'సాహో' దర్శకుడు సుజిత్.. ఆగస్టు 2వ తేదీన ప్రవల్లిక అనే యువతి మెడలో మూడుముళ్లు వేశాడు. 
హీరో రానా దగ్గుబాటి తన ప్రియురాలు మిహీక బజాజ్‌ను ఆగస్టు 8న వివాహం చేసుకున్నాడు. 
హీరోయిన్ కాజల్ అగర్వాల్... ముంబైకు చెందిన యువపారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లిచేసుకుంది. 
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక యువ టెక్కీ చైతన్య జొన్నలగడ్డను డిసెంబరు 9న పెళ్లాడింది.
 
అలాగే, సింగర్ నేహా కక్కర్.. పెళ్లి తేదీ అక్టోబర్ 24.. భర్త పేరు రోహన్ ప్రీత్ సింగ్, సింగర్ ఆదిత్య నారాయణ్.. పెళ్లి తేదీ డిసెంబర్ 1.. నిశ్చితార్థం జరిగింది.. కాబోయే భార్య పేరు శ్వేతా అగర్వాల్, బాలీవుడ్ నటి గౌహార్ ఖాన్..  పెళ్లి తేదీ డిసెంబర్ 25.. కాబోయే భర్త పేరు జైద్ దర్బార్, బాలీవుడ్ టీవీ నటుడు షహీర్ షైక్.. పెళ్లి ఫిబ్రవరి 2021.. నిశ్చితార్థం జరిగింది.. కాబోయే భార్య పేరు రుచిక కపూర్.
 
ఇక జబర్ధస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ కూడా లాక్డౌన్ స‌మ‌యంలో పెళ్లి చేసుకున్నాడు. అతడితో పాటు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ కూడా వివాహమాడాడు. ఇప్పుడు ప‌లు సినిమాల‌లో విల‌న్‌గా న‌టిస్తూ అల‌రిస్తూ వ‌స్తున్న క‌బీర్ సింగ్.. పాపులర్ పంజాబీ సింగర్ అయిన డాలీ సింధుతో ఏడ‌డుగులు వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా మరికొంతమంది కూడా కరోనా కష్టకాలంలో ఓ ఇంటివారయ్యారు.