వృషభరాశిలో జన్మించారా.. ఎలాంటి రత్నాలు ధరిస్తున్నారు?
వృషభరాశిని అంగ్లంలో టారస్ అని వ్యవహరిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు కుటుంబ కార్యాలలో మంచి వ్యవహారశీలురు, ఆలోచనా పరులు, విలాస వంతులు, సౌందర్యవంతులుగాను ఉంటారని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడని, వీరు వజ్రమును ధరించినచో శుభ ఫలితాలను ఇస్తుందని వారు తెలుపుతున్నారు. అసలైన వజ్రం తెలుపురంగులో ఉండునని, ఓపెల్, స్ఫటిక, సఫేద్ హాకీక్ తదితరాలు వజ్రానికి ఉపరత్నాలుగా ఉంటాయని రత్నకారులు చెబుతున్నారు.
వృషభరాశి వారు వజ్రాన్ని ధరించినట్లైతే శుక్రగ్రహ దోషాలను నివారిస్తుందని, ధనధాన్యాలు సంవృద్ధిగా ఉంటాయని రత్నశాస్త్రకారులు వెల్లడిస్తున్నారు. వజ్రాన్ని ధరించడం వల్ల శారీరక ఆరోగ్యం కుదుటపడుతుందని, ఈ రాశిలో పుట్టిన ఆడవారు వజ్రాలను నక్లెస్ చెయించుకుని ధరించినట్లైతే సత్ఫలితాలను కలిగిస్తుందని రత్నాల శాస్త్రం చెపుతోంది.
వజ్రం చారలు లేకుండా కఠినంగా, స్థిరంగా, ఉండి పట్టుకుంటే జారిపోతున్నట్టుగా ఉంటుంది చెపుతున్నారు. సూర్యకాంతిలో పెట్టిన వజ్రంలో ఇంద్రధనస్సు కానిపించినట్లైతే వాటిని అసలైన వజ్రాలుగా గుర్తించాలని వారు చెపుతున్నారు. శుక్రవారం సూర్యోదయవేళలో వజ్రాన్ని బంగారులో పొదిగించుకుని కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలను ఇస్తుందని రత్నశాస్త్రకారులు చెబుతున్నారు. ధరించడానికి ముందుగా వజ్రపుటుంగరాన్ని పాలలో, గంగాజలంతో శుద్ధి చేయాలని కోరుతున్నారు.