1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (18:18 IST)

అత్యంత బలవర్ధకమైన ఆహారం పాలు...

నేటి ఆధునిక యుగంలో స్త్రీలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇంటా బయట నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాలంతో పోటీ పడుతు పరుగులు తీసే మహిళల ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం ఎంతైనా అవసరం. కానీ సమయా భావం కారణంగా సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అటువంటివారికి పాలు చక్కగా ఉపకరిస్తాయి.
 
మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి.
 
కనుకనే స్త్రీలు చిన్న వయస్సు నుంచే పాలను తీసుకోవడం ఎంతైన అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నోటిలో దంతాలు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి కూడా కాల్షియం బాగా ఉపకరిస్తుందని వారు తెలుపుతున్నారు.
 
పాలలో 87 శాతం నీరు, 4 శాతం క్రొవు పదార్ధాలు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి. పాలలో లాక్టోసు అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. అంతేకాక ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయని వారు అంటున్నారు.
 
చిన్న వయస్సు అంటే 7-10 వయస్సు గల అమ్మాయిలు రోజుకు సుమారు 3-4 గ్లాసుల పాలు, పెరిగే వయస్సులో నాలుగు గ్లాసుల కంటే ఎక్కువ పాలు, పాతికేళ్ళ వయస్సులో 2 గ్లాసుల పాలు రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాలు తాగేందుకు ఇష్టపడని వారైతే పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఐస్ క్రీములు, చాక్లేటులు మొదలైన వాటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.