మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (13:55 IST)

సరిగ్గా నిద్రపట్టడం లేదా.. ఏమవుతుంది..?

కొందరిలో సరిగా నిద్ర పట్టదు.. నీరసంగా ఉండడం చర్మం ఎండిపోయి, దురదగా ఉండడం వంటివి బాధిస్తుంటాయి. ఇవి కిడ్నీ సంబంధిత వ్యాధులకు సూచికలు కావొచ్చు. ఇవేకాదు మనం సాధారణమైనవిగా భావించే చాలా లక్షణాలు మనలో కిడ్నీలు పనితీరు దెబ్బతిన్న తొలిదశలో ఏర్పడుతాయి. వీటిని ముందుగానే గుర్తిస్తే.. కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే నియంత్రించవచ్చు. 
 
ఈ లక్షణాలకు ఇతర కారణాలు ఉండేందుకు అవకాశముంది. అందువలన కేవలం ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కిడ్నీ సమస్యలు ఉన్నట్లుగా భావించవద్దు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. తగిన వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఏమిటో నిర్ధారించుకోవడం అవసరం. మరి కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే సమస్యలు, కారణాలేమిటో తెలుసుకుందాం..
 
శరీరంలో కిడ్నీలు సరిగా పనిచేయకపోతే సరిగ్గా నిద్రపట్టని పరిస్థితి ఉంటుందని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో చేరే వ్యర్థాలు, విషపూరిత రసాయనాలు శరీరం నుండి బయటకు విసర్జించబడవు. దీనివలన రక్తంలో విషపూరిత పదార్థాల శాతం పెరిగిపోయి.. శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది నిద్ర పట్టని పరిస్థితికి దారితీస్తుంది.
 
ముఖ్యంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి సాధారణంగా స్లీపమ్ అప్నియా (గాఢ నిద్ర ఉనప్పుడు అకస్మాత్తుగా శ్వాస ఆడని పరిస్థితి) సమస్య వస్తుంటుంది. విపరీతంగా గురక సమస్య ఉన్నవారికి కూడా కిడ్నీ సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ. అలాంటివారు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.