ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (08:23 IST)

చిన్నారుల చెవులకు ఇన్ఫెక్షన్ ముప్పు

చిన్నపిల్లలకు చెవుల్లో వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి వారు ఎదిగే వయసులో వినికిడి శక్తిని తగ్గించే ప్రమాదం ఉంటుంది. చిన్న పిల్లల్లో మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల వ్యాధులు వస్తాయి. వాటిని అక్యూట్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌, క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌, అక్యూట్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌ మీడియా, క్రానిక్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌ మీడియా అంటారు.

చెవి ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా జలుబు చేయడం వల్ల, స్నానం చేసేటప్పుడు మధ్య చెవిలో నీరు ఉండి పోవడం వల్ల , చల్లగాలిలో చిన్న పిల్లలను పడుకోబెట్టడం వల్ల వస్తుంటాయి. కొంతమందికి టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల, పంటి నొప్పితో కూడా చెవిపోటు వస్తుంది. 
 
ఇన్ఫెక్షన్‌కు గురైన చెవినొప్పి రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. పిల్లల పాలు తాగలేరు. తీవ్రమైన బాధతో ఏడుస్తారు. చెవి లోపల ఎర్రబడి, ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. చాలాసార్లు నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడమూ కష్టమే. కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. మీజిల్స్‌, డిఫ్తీరియా వంటి వ్యాధులతోపాటు చెవి సమస్యలు వస్తాయి. పిల్లల మెడ దగ్గర సర్వైకల్‌ గ్రంథులు పెద్దవవుతాయి. తలనొప్పి, గొంతు నొప్పి ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌కు తగిన చికిత్స చేయించాలి. 
 
అక్యూట్‌ కేసుల్లో తరువాత చెవి నుంచి చీము కారవచ్చు. సరైన సమయంలో తగిన చికిత్స చేస్తే ఒటైటిస్‌ మీడియాను పూర్తిగా నయం చేయవచ్చు. క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవుడు వస్తుంది. స్థానికంగా నొప్పి ఉండదు. చెవిలో చీము ఉండదు. జలుబు చేసినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చెవిలో వినికిడి తగ్గుతుంది. చెవిలో శబ్దాలు వస్తాయి. గుటక వేస్తే చెవిలో శబ్దం వస్తుంది.

మాట్లాడుతూ ఉంటే ప్రతిధ్వని వినిపిస్తుంది. కొన్నిసార్లు చెవిలోపల దురదగా ఉంటుంది. కొంతమందిలో చెవిలో నీరు ఎండిపోయినట్లు ఉంటుంది. ద్రవాలతో ఎవరుపడితే వారు చెవులని క్లీన్‌ చేసుకోకూడదు,. బడ్స్‌ వాడడం కూడా ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు. నిపుణుల పర్యవేక్షణలోనే చెవులను అవసరమైతేనే శుభ్రం చేయించాలి.