సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సందీప్ కుమార్
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (15:04 IST)

స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవడం లేదా? కాస్త జాగ్రత్త.. ఏమౌతుందో తెలుసా?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవరికీ రోజు గడవడం లేదు. స్మార్ట్ ఫోన్‌లో ఉండే ఫీచర్లతో మనం అనేక పనులను ఇంటి నుండే చేసేస్తున్నాం. జనాలు దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు.


స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలున్నా, దానిని అధికంగా వాడితే అనారోగ్యాలు తప్పవు. రోజూ 5 గంటలకు మించి స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తే పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. 
 
ఇటీవల సిమోన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ సైన్సెస్ విభాగం విద్యార్థులు 1060 మందిపై సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో ఇది వెల్లడైంది. స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ తదితర అనారోగ్య సమస్యలకు గురికావల్సి వస్తుంది. ఆ విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. 
 
అలాగే వారు నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ ఫోన్‌ను వాడుతారనే వివరాలను కూడా రాబట్టారు. దీంతో చివరకు తేలిందేమిటంటే, నిత్యం 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని, అదే విద్యార్థినులు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు. 
 
స్మార్ట్‌ ఫోన్ వాడకం నిత్యం 5 గంటలకు మించితే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సదరు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే స్థూలకాయం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని, అది మన శరీరానికి ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. కనుక స్మార్ట్‌ ఫోన్‌లను పరిమితంగా వాడాలని వారు సూచిస్తున్నారు.