శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (17:43 IST)

కరోనా కాలంలో కంటి సమస్యలు

మారిన పరిస్థితుల్లో కంప్యూటర్‌ మనకి మరింత దగ్గర చుట్టం అయిపోయింది. ల్యాప్‌ టాప్‌ కావచ్చు, స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్‌... ఇలా పేరేదైనా మనకు  ఆత్మీయ నేస్తాల్లా మారిపోయాయి. స్క్రీన్స్‌ను తదేకంగా చూస్తుండడం అనేది ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. వర్క్‌ఫ్రమ్‌ హోమ్, ఆన్‌లైన్‌ స్కూల్స్, ఆన్‌లైన్‌ బిజినెస్, జూమ్‌ మీటింగ్స్, ఓటీటీ సినిమాలూ,... ఇలా ప్రతీదానికీ స్క్రీన్‌ వ్యూ సర్వసాధారణంగా మారింది.
 
రోజులో అత్యధిక సమయం కంప్యూటర్‌ స్క్రీన్‌ చూస్తూ గడపడం అనేది అనేకమందిలో తీవ్రమైన కంటి సమస్యలకు దారి తీస్తోంది. అలాగే ఇంటిపట్టున ఉండటం పెరగడంతో నిర్విరామంగా టీవీ చానెళ్లను వీక్షించడం ఎక్కవైంది. దీంతో ఇది కంటి మీద తీవ్రమైన భారంగా మారింది. అప్పటికే కంటి సమస్యలున్నవారు కరోనా అనంతరం మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
 
ఇలాంటి వారు తాత్కాలిక పరిష్కారాలుగా కళ్లోజోడు, కాంటాక్ట్‌లెన్స్‌లు ఎంచుకోవడం కన్నా శాశ్వత పరిష్కారమైన లేజర్‌ సర్జరీకి ఓటేయడమే మేలంటున్నారు డా. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌ ఆప్తమాలజిస్ట్, ఆల్పా అతుల్‌ పూరాబియా. ఈ నేపధ్యంలో సర్జరీలపై ఉన్న అపోహలను, భయాలను తొలగించుకోవాలని ఆమె సూచిస్తున్నారు. 
 
కాంటాక్ట్‌ లెన్స్‌తో డ్రైనెస్‌...
దృష్టి లోపాన్ని సరిదిద్దడానికి కళ్లజోళ్లు, కాంటాక్ట్‌ లెన్స్‌లు సులభ పరిష్కారం మాత్రమే, మరోవైపు క్రీడాకారులకు ఇది సరైన పరిష్కారం కాబోదు. స్క్రీన్‌ వీక్షణం కోసం పరిమితంగా కొన్ని గంటల కాలమే అయినా కాంటాక్ట్‌ లెన్స్‌ వినియోగం కూడా కళ్లలో డ్రైనెస్‌ను పెంచుతోంది. కాబట్టి స్మైల్, లాసిక్, పిఆర్‌కె వంటి రిఫ్రాక్టివ్‌ లేజర్‌ ఐ సర్జరీలు కంటి సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారం. 
 
ఎవరు చేయించుకోవచ్చు?
లాంగ్, షార్ట్‌ సైట్‌లకు రిఫ్రాక్టివ్‌ లేజర్‌ ఐ సర్జరీ అనేది అత్యంత ఖచ్చితమైన పరిష్కారాల్లో ఒకటి. గత 12 నెలలుగా కళ్లజోడు వాడుతూ ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకుండా ఉన్న 21 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ సర్జరీని ఎంచుకోవచ్చు. అయితే బాగా పల్చని కార్నియా ఉన్నా, కార్నియా పైన అపసవ్యతలేవైనా ఉన్నా దీర్ఘకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్జరీ చేయించుకోవడానికి వీలు ఉండదు. దీన్ని నిర్ధారించుకోవడానికి ముందుగా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే ఈ సర్జరీ విషయంలో కొందరికి పలు రకాల అపోహలు కూడా ఉన్నాయి.
శస్త్రచికిత్స విధానం బాధాకరంగా ఉంటుందని కొందరు అపోహ పడుతున్నారు. అయితే అది నిజం కాదు. సర్జరీ విషయంలో వైద్యులు తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. నొప్పిని వీలున్నంత తక్కువ స్థాయిలో ఉంచేందుకు కంటి డ్రాప్స్‌ వంటివి వాడతారు. అలాగే శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా సందేహిస్తుంటారు. ఇదీ నిజం కాదు. సర్జరీ పూర్తయిన తర్వాత కేవలం 2 నుంచి 6 రోజుల వ్యవధిలోనే సాధారణ జీవితానికి తిరిగి వెళ్లవచ్చు.
 
శాశ్వత దృష్టిలోపానికి దారి తీసే ప్రమాదం ఉందని మరికొందరి అపోహ. అయితే కంటిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఏర్పడితే తప్ప ఈ సర్జరీ కారణంగా శాశ్వత దృష్టి లోపం కలగడం జరగదు. ఇది చాలా అరుదైన విషయం. స్వల్పంగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చినప్పటికీ అవన్నీ సులభంగా పరిష్కరించుకోగలిగినవే. 
 
సర్జరీ అయిన తర్వాత రెగ్యులర్‌ ఐ చెకప్స్‌ అక్కరలేదనేది కూడా అపోహే. లేజర్‌ కంటి శస్త్ర చికిత్స అనేది జీవితకాలం కంటి ఆరోగ్యానికి హామీ కాదు. వయసుతో పాటు వచ్చే మార్పుల ప్రభావం కంటి ఆరోగ్యం మీద ఉండొచ్చు. కాబట్టి సర్జరీ తర్వాత కూడా క్రమబద్ధమైన పద్ధతిలో కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమే.
 
సైడ్‌ ఎఫెక్ట్స్‌ తీవ్రంగా ఉంటాయని కొందరు భయపడుతుంటారు. స్వల్పంగా అసౌకర్యం అనిపించడం సహజమే. అయితే వీటిని పెయిన్‌ కిల్లర్స్‌ ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చు. అలాగే కళ్లు పొడిబారటం కూడా మరో సైడ్‌ ఎఫెక్ట్‌. చాలామంది పేషెంట్స్‌ సర్జరీ అయిన కొన్ని వారాల్లోనే అన్నింటి నుంచి విజయవంతంగా కోలుకుంటారు. ఆటలు క్రీడల్లో రాణించాలనుకున్నవారికి ఇది చక్కని ఉపయుక్తం.
- డాక్టర్ ఆల్పా అతుల్‌ పూరాబియా, ఆప్తమాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, హైదరాబాద్‌