బియ్యం ఉడకక్కర్లేదు.. నానబెడితే చాలు అన్నం అవుతుంది.. ఎలా?
అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్కర్ పెడతా అంటారు గృహిణులు. వేళకాని వేళలో మమ్మీ ఆకలి అని పిల్లలు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగరా వండి పెడతా అంటారు.. ఇక నుంచి ఈ మాటలు వినిపించవు.. అంటే అన్నం తినం అని కాదు.. వండాల్సిన పనిలేదు అని. అన్నం అంటే ఇప్పుడే బియ్యం నానపెట్టా.. ఓ అర గంట ఆగు వడ్డిస్తా అంటారు. అవును... దేశంలోనే ఉత్పత్తి అవుతున్న ఈ రకం బియ్యం.. మరికొన్ని రోజుల్లోనే దేశంలోని అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఉడకబెట్టకుండా.. నానబెడితే అన్నం తయారయ్యే ఈ రకం బియ్యం విశేషాలు ఏంటో చూద్దాం.
అసోంలో పండిస్తున్న ఈ బియ్యం పేరు బోకా సౌల్. అందరూ ముద్దుగా మ్యాజిక్ రైస్ అంటారు. దీనికి మరోపేరు కూడా ఉంది.. అదే మడ్ రైస్. వీటిని అసోంలోని కొండ ప్రాంతాల్లో పండిస్తున్నారు రైతులు. ఈ పంట సీజన్ జూన్ నుంచి డిసెంబర్ నెల. ఈ ఆరు నెలలు పంటకు అనుకూలం. దొడ్డుబియ్యంలా లావుగా ఉంటాయి. ఈ బియ్యాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. చన్నీళ్లలో ఓ గంట నానబెడితే చాలు.. అన్నం తయారవుతుంది.
చక్కగా తినేయొచ్చు. మామూలు అన్నంలాగే ఉంటుంది. ఓ కేజీ మామూలు రైస్ వండితే.. ఎంత ఎక్కువ అన్నం వస్తుందో.. అదేవిధంగా ఈ మ్యాజిక్ అలియాస్ మడ్ రైస్‌ను నానబెట్టినా అంతే ఎక్కువ వస్తుంది. ఈ పంట పండించటానికి పురుగు మందులు, రసాయన ఎరువులు అవసరం లేదు. పురుగు మందులు చల్లితే పంట నాశనం అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
సో.. గ్యాస్‌తో పనిలేదు.. కరెంట్ అవసరం లేదు.. కుక్కర్లు కొనాల్సిన అవసరం లేదు.. జస్ట్ ఓ గంట నానబెడితే చాలు అన్నం తయారీ. కొన్ని సంవత్సరాలుగా మడ్ రైస్, మ్యాజిక్ రైస్ పండిస్తూనే ఉన్నారు అసోం రైతులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి పేటెంట్ ఇచ్చింది. దీంతో మరోసారి చర్చనీయాంశం అయ్యింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రకం వంగడాన్ని సృష్టించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అసోం రాష్ట్ర ప్రజలు పండుగలు, ఫంక్షన్లలో ఈ బియ్యంతో తయారైన అన్నాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొఘల్ రాజుల కాలంలో ఇలాంటి బియ్యం ఉత్పత్తి జరిగింది. 17వ శతాబ్దంలో సైనికులు ఇదే ఆహారంగా తీసుకునేవారంట.
పోషక విలువల మాటేంటీ?
ఈ బియ్యంపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా గువాహటి యూనివర్సిటీ పరిశోధనల్లో బోకా సౌల్ బియ్యం విశిష్టతను వివరించారు. ఈ బియ్యంలో పీచుపదార్ధం 11 శాతం, మాంసకృత్తులు 7 శాతం ఉన్నట్లు తేలింది. ఈ అన్నం వల్ల శరీరంలో వేడి కూడా తగ్గుతుంది.