సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (20:24 IST)

మ‌న్మ‌థుడు 2 ఫ్యామిలీ ఇదే... సన్సేషన్ క్రియేట్ చేస్తారా?

అక్కినేని నాగార్జున కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం మన్మథుడు. ఈ  సినిమా ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ క‌థ‌తో విజ‌య్ భాస్క‌ర్ ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఈ సంచ‌ల‌న చిత్రానికి రెండో భాగంగా ఇప్పుడు మన్మథుడు 2 రాబోతుంది. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ల పైన అక్కినేని నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్ సెట్‌లో చిత్ర యూనిట్‌తో తీసుకున్న సెల్ఫీని నాగార్జున ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో నాగార్జునతో పాటు హీరోయిన్లు రకుల్, రష్మిక, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, రావు రమేష్, సీనియర్ నటి లక్ష్మి, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు కనిపిస్తున్నారు. మ‌రి... మ‌న్మ‌థుడు సినిమా వ‌లే మ‌న్మ‌థుడు 2 కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.