గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 11 డిశెంబరు 2020 (17:51 IST)

మందులు అతిగా వాడితే కాలేయానికి డ్యామేజ్...

కొన్ని మందులు అతిగా వాడితే కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి కొన్ని రకాల మందుల్ని అతిగా వాడటం వల్ల వచ్చే దుష్పరిణామాలను ఇంట్రిన్సిక్‌ రియాక్షన్స్‌ అంటారు. ఉదాహరణకు జ్వరానికని వేసుకునే మాత్రలు చాలా సురక్షితమైనవి అన్న ప్రచారముంది. కానీ ఎక్కువ మోతాదులో వేసుకుంటే అవి కూడా కాలేయాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ మంది తరచూ వాడే పెయిన్‌ కిల్లర్లు అతిగా వాడినా ఈ కాలేయ సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 
 
జ్వరానికి వాడే మాత్రలు అతి వినియోగం వల్ల ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వైద్యం కోసం మరో రకం మందుల్ని ఇస్తుంటారు. అయితే ఇంకా కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు ఎలా ఉంటాయన్నది చాలా పరిశోధనల తర్వాత కూడా స్పష్టం కాలేదు. ఇలా తెలియని విషయాలను ‘ఇడియోసింక్రాటిక్‌’ అంటారు. కాకపోతే కాలేయం మిగతా శరీర భాగాల్లా కాకుండా వేరుగా స్పందించడాన్ని బట్టి కొన్నిసార్లు సమస్యను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది.
 
నిజానికి ఈ ఇడియో సింక్రాటిక్‌ పరిణామాలు చాలా అరుదుగానే కనపడతాయి. చాలా మందిలో ఈ దుష్ప్రభావాలు మన దృష్టికి అందడానికి దాదాపు ఆరుమాసాల వరకు పడుతుంది. కాకపోతే ఆ కాల వ్యవధి వ్యక్తివ్యక్తికీ వేరుగా ఉంటుంది. ఏమైనా ఇంట్రిన్సిక్‌ రియాక్షన్స్‌తో పోలిస్తే, ఇడియోసింక్రాటిక్‌ రియాక్షన్స్‌ చాలా తక్కువగానే కనిపిస్తాయి. ఈ రియాక్షన్స్‌ను గుర్తించడం కష్టమే కాకుండా ఒక్కోసారి హెపటైటిస్‌ వంటి ఇతర కాలేయ వ్యాధులుగా పొరబడే ప్రమాదం ఉంది. 
 
మార్కెట్‌లోకి రావడానికి ముందు ఇండియన్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో పరీక్షించబడిన మందుల్లో కూడా కొన్ని ఇప్పటికీ హానికారకంగా పనిచేస్తూనే ఉన్నాయి. అందువల్ల ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు ప్రకృతి సహజంగా అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు వున్న పరిష్కార మార్గాలను చూడాలి. జలుబు చేయగానే మాత్ర వేసుకోకూడదు. ఆవిరి పట్టడం, అల్లంతో కషాయం సేవించడం వంటివి చేస్తే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.